Akhilesh Yadav | తికమ్గఢ్, నవంబర్ 5: ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విపక్ష ‘ఇండియా’ కూటమి మూణ్నాళ్ల ముచ్చట లాగా కనిపిస్తున్నది. ఒకసారి కూడా కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీచేయకుండానే అప్పుడే కూటమికి బీటలు వారుతున్నాయి. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు ఎవరికి వారే పోటీచేస్తుండగా.. ఇటు కాంగ్రెస్ తీరుపై కూటమిలోని ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొసగకపోవడంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సొంతంగా బరిలోకి దిగింది.
ఆదివారం రాష్ట్రంలోని తికమ్గఢ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ను పెద్ద ‘కన్నింగ్(జిత్తులమారి)’ పార్టీగా అభివర్ణించారు. కమలం పార్టీకి ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓట్ల కోసం కులగణన చేపడుతామని కాంగ్రెస్ చెబుతుందే తప్ప, ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమను మోసం చేయగలిగిన పార్టీ.. ఇక రాష్ట్ర ప్రజలను మోసం చేయడం పెద్ద పని కాదని అఖిలేశ్ అన్నారు.