కోల్‌కతా: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మమతకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసే ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులను ప్రస్తావిస్తూ ఈడీని దీదీ ఓడించారు. ఇక బీజేపీని ఆమె ఓడించడం తథ్యం అని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు.
కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఇటీవల ఈడీ దాడుల సమయంలో మమత నేరుగా అక్కడకు వెళ్లి టీఎంసీకి చెందిన ఫైళ్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను తనతో తీసుకెళ్లిపోవడాన్ని గుర్తు చేస్తూ పెన్ డ్రైవ్‌ను కోల్పోయానన్న బాధను బీజేపీ మరచిపోలేకపోతున్నదని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాలను ఎదుర్కొనే సత్తా దీదీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. బెంగాల్ కోసమే ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)ని ఈసీ తీసుకువచ్చిందని ఆయన చెప్పారు.