లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్వరలో జరగనున్న మహా కుంభమేళాకు జరుగుతున్న ఏర్పాట్ల తీరుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిర్వహణ లోపానికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం మాడల్‌గా మారిందని విమర్శించారు. ఈ మెగా కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న భద్రతా ఏర్పాట్లపైనా ఆయన పెదవి విరిచారు. అత్యంత కీలకమైన పోలీసు వ్యవస్థ కూడా నిర్వహణ లోపానికి బలయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా భద్రత, రద్దీ నియంత్రణను పర్యవేక్షించేందుకు వాచ్ టవర్లు, జల్ పోలీస్ స్టేషన్లు కూడా నిర్మించలేదని, సీసీటీవీలను అమర్చలేదని మండిపడ్డారు.
డబ్బు సంపాదన యావలో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారని, వారికి కుంభమేళా నిర్వహించడం చేతకాకపోతే ప్రభుత్వానికి సాయం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.