న్యూఢిల్లీ: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. ఆ సమయంలో పలు పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం ఎందుకు తొందరపడుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ముందుగా జనగణన ప్రారంభించాలన్నారు. మహిళా రిజర్వేషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇస్తుందని, కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మహిళా కోటాను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేశ్ తెలిపారు. ఒకవేళ జనగణన జరిగిన తర్వాత మేం కుల గణన గురించి అడుగుతామని, అప్పుడు రిజర్వేషన్ సమస్య వస్తుందని, అందుకే మమ్ముల్ని మీరు మోసం చేస్తున్నారని అఖిలేశ్ ఆరోపించారు.
అయితే అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దేశంలో జనగణన ప్రక్రియ మొదలైందని అమిత్ షా తెలిపారు. కుల గణన కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, 2027 జనాభా లెక్కల్లో కుల గణన కూడా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జనాభా లెక్కల సమయంలో కుల గణన కూడా జరుగుతందని సభకు హామీ ఇస్తున్నానని మంత్రి తెలిపారు. మతం ఆధారంగా కేవలం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం అప్రజాస్వామికమే అవుతుందని మంత్రి షా అన్నారు. అంటే ముస్లింలు 50 శాతం కేటగిరీలోకి రారా అని అఖిలేశ్ అడిగారు. దానికి కౌంటర్ ఇస్తూ సమాజ్‌వాదీ పార్టీ తమ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకే ఇవ్వాలని, దీన్ని మేం వ్యతిరేకించమని అమిత్ షా అన్నారు. అయితే చర్చించాల్సిన తీరు ఇది కాదు అని, ఆ ఇద్దరి మధ్య చర్చను స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు.