Ayodhya Incident : అయోధ్యలో బాలికపై సామూహిక లైంగిక దాడి కేసు వ్యవహారంలో యూపీలోని యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు కుట్ర రాజకీయాలకు తెరలేపాలని బీజేపీ కోరుకుంటున్నదని అన్నారు. తొలి నుంచీ సోషలిస్టులు ముఖ్యంగా ముస్లింల పట్ల బీజేపీ వ్యవహారశైలి అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అఖిలేష్ యాదవ్ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఒక యోగికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకుంటే ఆయన యోగి కాలేరని అన్నారు. ఇక ఈ ఘటనపై అఖిలేష్ గతంలోనూ యోగి సర్కార్‌పై మండిపడ్డారు. సామూహిక లైంగిక దాడిలో బాధితురాలికి రక్షణ కల్పించేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని అఖిలేష్ న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు. ఈ కేసును బీజేపీ నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాలిక జీవితాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతని అఖిలేష్ పేర్కొన్నారు.
కేసు సున్నితత్వం దృష్ట్యా కోర్టు పర్యవేక్షణలో బాలికకు పూర్తి భద్రత కల్పించాలని న్యాయస్ధానాన్ని తాను కోరుతున్నానని అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయోధ్యలో ఇటీవల 12 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జులై 30న బేకరీ యజమాని మొయిద్ ఖాన్, ఉద్యోగి రాజు ఖాన్‌లను పురకలందర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు ఎస్పీ నేతలు, కార్యకర్తలు కావడంతో వారిని కాపాడేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read More :