Cleanest Air | దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ, యూపీ, నోయిడా, లక్నో సహా పలు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచీ క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index ) ఏకంగా 450కుపైనే నమోదవుతోంది. తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కళ్ల మంటలు, తలనొప్పి వంటి పలు అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
ఇదే సమయంలో పలు నగరాలు స్వచ్ఛమైన గాలిని (Cleanest Air) పీల్చుకుంటున్నాయి. దేశంలోని దాదాపు తొమ్మిది నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా మంచి కేటగిరీలో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం.. అతి తక్కువ కాలుష్య నగరాల జాబితాలో మిజోరాంలోని ఐజ్వాల్ (Aizawl) తొలి స్థానంలో ఉంది. ఐజ్వాల్‌లో గాలి నాణ్యత సూచీ 26 వద్ద నమోదైంది. దీన్ని మంచి కేటగిరీ కింద భావిస్తారు. దీంతో అక్కడి నివాసితులు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఐజ్వాల్ తర్వాత సిక్కింలోని గ్యాంగ్‌టక్ (Gangtok), మేఘాలయాలోని షిల్లాంగ్ వరుసగా రెండు, మూడు స్థానాలో నిలిచాయి. ఈ నగరాల్లో ఏక్యూఐ లెవల్స్ వరుసగా 35, 36 వద్ద నమోదయ్యాయి. ఆ తర్వాత అస్సాంలోని గువాహటిలో 40, కర్ణాటకలోని చామరాజనగర్ 41, బాగల్కోట్లో 42, కేరళ త్రిస్సూర్‌లో 43, అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లగన్లో 51, అస్సాం నాగాన్ నగరంలో ఏక్యూఐ లెవల్స్ 53తో సంతృప్తికరంగా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరాల్లో తొలి స్థానంలో ఉంది. ఇక్కడ గాలి నాణ్యత సూచీ తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 422 వద్ద నమోదైంది. మంగళవారంతో పోలిస్తే.. నేడు ఏక్యూఐ లెవల్స్ 494 నుంచి 422కి పడిపోయింది. అయినప్పటికీ ఇంకా ప్రమాదకర విభాగంలోనే ఉంది.
Also Read..
Heavy Rain | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షం.. ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
Air Pollution | ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 50 శాతం ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించిన సర్కార్
Viral Video | అతిథులపై నోట్ల వర్షం.. రూ.20 లక్షలు వెదజల్లిన పెళ్లివారు..VIDEO