న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో అల్లర్లు, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారి తరలింపు కోసం ఎయిర్ ఇండియా (Air India) ఒక ప్రత్యేక విమానాన్ని నడిపింది. మంగళవారం రాత్రి ఖాళీ విమానం ఢిల్లీ నుంచి ఢాకా చేరుకున్నది. ఆరుగురు శిశువులు, 199 మంది పెద్దలతో సహా 205 మంది ప్రయాణికులను బుధవారం ఢిల్లీకి తీసుకొచ్చింది. అయితే మంగళవారం ఉదయం షెడ్యూల్ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. సాయంత్రం ఢాకాకు విమానాన్ని యథావిధిగా నడిపింది.
కాగా, షెడ్యూల్డ్ కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఢాకాకు రెండు రోజువారీ విమానాలను బుధవారం నడపనున్నట్లు పేర్కొంది. విస్తారా, ఇండిగో ఎయిర్లైన్స్ కూడా షెడ్యూల్ ప్రకారం ఢాకాకు విమాన సేవలు నిర్వహించనున్నాయి. ఈ రెండు విమాన సంస్థలు మంగళవారం ఢాకాకు విమానాలను రద్దు చేశాయి.
మరోవైపు బంగ్లాదేశ్లో ఉద్యోగ కోటాపై నిరసనలు ఉధృతం కావడంతో ప్రధాని షేక్ హసినా సోమవారం ఆ దేశాన్ని విడిచి భారత్కు పారిపోయి వచ్చారు. అనంతర పరిణామాలతో ఆ దేశ పార్లమెంట్ రద్దు కావడంతో బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది.