Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, ముంబై నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమాన సర్వీసులను నిలివేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఉత్తర అమెరికా నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు ఎయిరిండియా తెలిపింది. విమానాల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న గగనతల పరిమితుల కారణంగా పెరుగుతున్న ఆపరేషన్ ఖర్చులను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. తాజా నిర్ణయం ప్రకారం ఇండియాలో కేవలం ఢిల్లీ నుంచి మాత్రమే శాన్ఫ్రాన్సిస్కోకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులను నడిస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం ఢిల్లీ నుంచి వారానికి ఏడు విమానాలు శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నాయి. వీటి సంఖ్యను 10కి పెంచుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. అలాగే ఢిల్లీ నుంచి టొరంటోకు కూడా వారానికి 10 విమానాలను నడిపించనున్నారు. భవిష్యత్తులో గగనతల పరిమితులను సడలిస్తే బెంగళూరు, ముంబై నుంచి మళ్లీ శాన్ఫ్రాన్సిస్కోకు నాన్ స్టాప్ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.
ఎయిరిండియా తాజా నిర్ణయంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తమ నిర్ణయంతో ప్రభావితమయ్యే ప్రయాణికులను ఇతర విమానాల్లో సర్దుబాటు చేయడం లేదా డబ్బు పూర్తి రీఫండ్ అందిస్తామని ఎయిరిండియా ప్రకటించింది.