చెన్నై, జూన్ 8: తమిళనాడులో బీజేపీతో పొత్తుపై రకరకాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ ఇ పళనిస్వామి తోసిపుచ్చారు. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, బీజేపీతో పొత్తు ఉండదని శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా, ఓటింగ్ శాతం 19 నుంచి 20 శాతానికి పెరిగిందని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి కృంగిపోమని, తాము తిరిగి పుంజుకుంటామని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా, 2023లోనే తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నామని, కేవలం ఎన్నికల్లో గెలవడానికే తప్ప తమిళనాడు ప్రజలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశం బీజేపీకి లేదని తెలిసి తాము అందులోంచి బయటకు వచ్చామని తెలిపారు. బీజేపీ నుంచి ఈ ఎన్నికల్లో దూరంగా ఉన్నామని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే వైఖరిని కొనసాగిస్తామని తెలిపారు. ఇక్కడ బీజేపీ తన ప్రాబల్యం పెంచుకుందన్న మాటల్లో నిజం లేదన్నారు. ‘2014లో ఎన్డీయేకు దక్కిన ఓట్లు 18.8 శాతం, 2024లో దక్కింది 18.28 శాతం. ఏఐఏడీఏంకే ఓట్లు బీజేపీకి బదిలీ కాలేదనడానికి ఇదే నిదర్శనం’ అని అన్నారు. మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న ప్రధాని మోదీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.