Dhanyawaad Yatra | కాంగ్రెస్ (Congress) పార్టీ మరో యాత్రకు సిద్ధమైంది. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఇండియా (INDIA) కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమికి మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘ధన్యవాద్ యాత్ర’కు (Dhanyawaad Yatra) హస్తం పార్టీ శ్రీకారం చుట్టింది. ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టనున్నట్లు శనివారం ప్రకటించింది. జూన్ 11 నుంచి 15 వరకూ ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
కాగా, 2024లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికారం చేజిక్కించుకోకపోయినప్పటికీ గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది అధికార ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. మిత్ర పక్ష పార్టీల సాయంతో ఇండియా కూటమి ఏకంగా 232 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియా కూటమిలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని హస్తం పార్టీ మంచి ప్రదర్శన కనబరిచింది.
ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు (80 లోక్సభ స్థానాలు) కలిగిన రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ఈసారి 62 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 37 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఆరు స్థానాలను గెలుచుకుంది. మొత్తంగా యూపీలో ఇండియా కూటమి 43 స్థానాలను కైవం చేసుకుంది. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది.
Also Read..
Ramoji Rao | రామోజీ మృతితో మీడియా, వినోద రంగం ఓ టైటాన్ను కోల్పోయింది : రాష్ట్రపతి ముర్ము
Mamata Banerjee | కమ్యూనికేషన్ ప్రపంచానికి ఆయన ఓ దార్శనికుడు.. రామోజీ మృతిపై దీదీ స్పందన
Ramoji Rao | రేపు రామోజీరావు అంత్యక్రియలు