Vande Mataram : వందేమాతరం ఆలపించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలతోపాటు రాష్ట్రంలో నడిచే మద్రాసాలలో కూడా వందేమాతరం చదవడాన్ని తప్పనిసరి చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన మద్రాసాలలో వందేమాతరాన్ని ఉదయం తప్పనిసరిగా ఆలపించాల్సిందే అంటూ రాష్ట్ర విద్యాశాఖ తరఫున డైరెక్టరేట్ ఆఫ్ మద్రాసా ఆధ్వర్యంలో ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో అనేక మద్రాసాలు మైనారిటీ వ్యవహారాల శాఖ, మద్రాసా విద్యా విభాగం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన వాటిల్లోనే కాకుండా, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మద్రాసాలలో తరగతులు ప్రారంభించే ముందు ఇకపై వందేమాతరం చదవాలి. సువేందు అధికారి సీఎంగా అధికారం చేపట్టిన రెండు వారాల వ్యవధిలోనే బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వందేమాతరం ఆలపించడానికి సంబంధించి గతవారమే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలోకి వచ్చే ప్రతి పాఠశాలలో ఆరు భాగాల వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం తరగతులు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులు తప్పనిసరిగా వందేమాతరం ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వందేమాతరం చుట్టూ ఇటీవల కొంత వివాదం జరుగుతోంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆదేశించింది. వందేమాతర గీతం దేశంలో రాజకీయంగా, సాంస్కృతికంగా గుర్తుగా నిలిచిందని కేంద్రం పేర్కొంది. జాతీయ గేయంతో సమానంగా జాతీయ గీతాన్ని కూడా గౌరవించాలని కేంద్రం పేర్కొంది.