Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఇప్పుడు రెండో షోరూం ప్రారంభించేందుకు టెస్లా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తన సెకెండ్ షోరూంను తెరవనున్నట్లు సమాచారం.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గల ఏరోసిటీ (Aerocity)లో టెస్లా సెకెండ్ షోరూంను ప్రారంభించనుంది. ఇందుకోసం వరల్డ్‌మార్క్ కాంప్లెక్స్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను నెలకు రూ.25 లక్షలు అద్దె చెల్లించేలా కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో ఢిల్లీ షోరూం కూడా ప్రారంభం కానున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాల సమాచారం.
ముంబైలో టెస్లా తొలి షోరూం ప్రారంభం
టెస్లా (Tesla) భారత విపణిలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఉదయం ముంబై (Mumbai) నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ఈ ఈవెంట్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె (Monthly Rent) చెల్లించనున్నారని తెలిసింది. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం.
‘Y’ మోడల్ కార్ల అమ్మకాలు..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది.
ఈ వాహనాలు చైనాలోని టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి దిగుమతయ్యాయి. ఈ వై మోడల్ వేరియంట్ ధరలు అమెరికాలో 44,990 డాలర్లు (భారత కరెన్సీలో రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్ (రూ.31.57 లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09 లక్షలు)గా ఉన్నాయి. వీటితో పోలిస్తే భారత్‌లోనే ఈ వై మోడల్ ధరలు అధికం కావడం గమనార్హం. దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Also Read..
Shubhanshu Shukla | వెల్‌కమ్‌బ్యాక్.. క్షేమంగా భూమికి చేరుకున్న శుభాన్షు బృందం
SpiceJet | కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ప్రయాణికులు.. స్పైస్‌జెట్ విమానంలో గందరగోళం