Operation Shiv Shakti | పహల్గాం దాడి (Pahalgam attack) తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్లు చేపట్టాయి. ఈ ఆపరేషన్ల ద్వారా 100 రోజుల్లో 12 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లను అంతం చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. హతమైన 12 మందిలో ఆరుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు కాగా.. మిగతా వారు జమ్ము కశ్మీర్లో జరిగిన ప్రధాన ఉగ్రదాడుల్లో పాల్గొన్న స్థానికులు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. మే 6-7 మధ్య చేపట్టిన ఈ ఆపరేషన్ సందర్భంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మందికిపైగా ఉగ్రవాదులను త్రివిధ దళాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత పలు ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద ఏరివేతను కొనసాగించాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది ‘ఆపరేషన్ మహాదేవ్’ (Operation Mahadev). ఈ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
జులై 28న శ్రీనగర్‌లోని దచిగామ్ ప్రాంతం సమీపంలో సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు సులేమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్ హతమయ్యారు. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరులని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజే శివశక్తి పేరుతో మరో ఆపరేషన్ (Operation Shiv Shakti)ను భద్రతా దళాలు మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్‌లో సైన్యం మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
పహల్గాం దాడి తర్వాత దక్షిణ కశ్మీర్, షోపియన్, పుల్వామాలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగించాయి. షోపియన్‌లోని కెల్లర్ ఫారెస్ట్‌లో జరిగిన ఆపరేషన్‌లోముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. మే 15న ట్రాల్‌లోని నాదర్ ప్రాంతంలో జరిగిన మరో ఆపరేషన్‌లో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. పహల్గాం దాడికి ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాదాపు 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు చురుకుగ్గా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. వాటిల్లో 110-130 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు పేర్కొన్నాయి. కశ్మీర్లో దాదాపు 70 నుంచి 75 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉండగా.. జమ్ము, రాజౌరి, పూంచ్‌లో 60-65 మంది ఉగ్రవాదులు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
Also Read..
Marco Rubio | రష్యాతో భారత్ చమురు బంధమే.. మాకు చికాకు తెప్పించే అంశం : అమెరికా విదేశాంగ మంత్రి
UPI Rules | యూపీఐలో కీలక మార్పులు.. నేటి నుంచి అమల్లోకి కొత్తరూల్స్.. అవేంటో తెలుసా..?
Andhra Minister | కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించిన ఏపీ మంత్రి సోదరుడు.. VIDEO