UPI Rules | డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లో (UPI) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 1 నుంచి ఎన్పీసీఐ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. బ్యాలెన్స్ చెక్, ఆటో పేమెంట్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు మారాయి. ఇవి వినియోగదారులతోపాటు బ్యాంకులు, వ్యాపారులను ప్రభావితం చేయనున్నాయి. ఎన్పీసీఐ కొత్త రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాలెన్స్ చెక్ పరిమితి..
ప్రస్తుతం ఉన్నట్టు అపరిమితంగా కాకుండా ఇకపై రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రెండు యాప్‌లను వినియోగిస్తుంటే ఈ పరిమితి వేర్వేరుగా ఉంటుంది.
యూపీఐ ఆటోపే లావాదేవీలకు టైమ్ స్లాట్..
యూపీఐ ఆటోపే లావాదేవీలకు ఎన్పీసీఐ నిర్ణీత టైమ్ స్లాట్లను నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐలు, వినిమయ బిల్లులు లాంటి చెల్లింపులను ఇకపై పగటిపూట ర్యాండమ్‌గా కాకుండా నిర్ణీత సమయాల్లో మాత్రమే ప్రాసెస్‌కు వీలుంటుంది. అవి ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటలు, రాత్రి 9.30 గంటల తర్వాతే ప్రాసెస్ అవుతాయి.
ఈ మార్పు వల్ల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావమేమీ ఉండదు. ఎందుకంటే వారి ఆటో-పేమెంట్లు యథావిధిగా పనిచేస్తాయి. కానీ, వ్యాపారులు మాత్రం తమ పేమెంట్ కలెక్షన్ షెడ్యూళ్లను నిర్దేశిత టైమ్ స్లాట్లకు అనుగుణంగా తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐని మరింత ఆధారపడదగినదిగా, ప్రత్యేకించి రద్దీ సమయాల్లో అంతరాయాలకు తావులేకుండా లావాదేవీలు సజావుగా సాగేలా తీర్చిదిద్దడం ఈ మార్పుల లక్ష్యం.
లింక్డ్ ఖాతా తనిఖీలు..
ఒక మొబైల్ నంబర్‌పై ఎన్ని బ్యాంకు ఖాతాలు లింక్ అయ్యాయో 25 సార్లకు మించి చూసుకోలేరు.
ట్రాన్సాక్షన్ స్టేటస్.. మూడు సార్లు మాత్రమే..
మీరు ఒక UPI ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అది పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం స్టేటస్ చెక్ చేస్తుంటాం. అయితే, NPCI ఇచ్చిన కొత్త రూల్స్ ప్రకారం, ఒకే లావాదేవీకి ఎక్కువసార్లు చెక్ చేయడం ఇకపై కుదరదు. మీరు గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే స్టేటస్ చెక్ చేసుకునే వీలు ఉంటుంది. అది కూడా 90 సెకన్ల గ్యాప్ఇవ్వాల్సి ఉంటుంది.
లబ్ధిదారుడి పేరు..
మీరు ఎవరికైనా డబ్బు పంపించే ముందు చెల్లింపును స్వీకరించే వారి UPI ID లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే, ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి పేరు (బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన విధంగా) ఇప్పుడు యాప్‌లో కనిపిస్తుంది. దీనివల్ల పొరపాట్లు తగ్గడంతోపాటు, మోసాలకూ ఆస్కారం ఉండదు.
Also Read..
Anil Ambani | 5న విచారణకు రండి.. అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
ట్రంప్ టారిఫ్‌లతో భారతీయ పరిశ్రమ ఆగం.. ఏయే రంగాలపై ప్రభావం?
మోదీ దౌత్యం అట్టర్ ఫ్లాప్.. ట్రంప్‌తో ఫలించని రాయబారం తప్పని సుంకాల సంకటం!