న్యూఢిల్లీ, జూలై 31 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాలు, ఆపై పడనున్న జరిమానాలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తున్నాయి. రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును పెద్ద ఎత్తున కొంటున్నామన్న ఒకే ఒక్క కారణంతో భారత్‌పై బుధవారం అడ్డగోలు సుంకాలను అగ్రరాజ్యాధినేత ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఏయే రంగాలపై ఎంతెంత ప్రభావం పడుతున్నదన్న విషయానికొస్తే..
దేశీయ టెక్స్టైల్ ఇండస్ట్రీని ట్రంప్ టారిఫ్‌లు గట్టిగానే దెబ్బతీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మనకు పోటీగా ఉన్న వియత్నాం, ఇండోనేషియాల కంటే ఎక్కువ సుంకాలు పడుతుండటంతో భారతీయ వస్త్ర పరిశ్రమ ఇక కుదేలేనన్న ఆందోళన ఎగుమతిదారుల్లో వ్యక్తమవుతున్నది. ఏటా ఆయా దేశాలకు భారత్ నుంచి 17 బిలియన్ డాలర్ల విలువైన రెడిమేడ్ దుస్తులు ఎగుమతి అవుతుండగా, అమెరికాకే 5.6 బిలియన్ డాలర్లు వెళ్తున్నాయి. రాబోయే నెలల్లో ఎగుమతులు తగ్గిపోతాయని భారతీయ టెక్స్టైల్ ఇండస్ట్రీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రిమా చటర్జీ అంచనా వేస్తున్నారు. బ్రిటన్, ఈయూ, దుబాయ్, జపాన్, కొరియా తదితర దేశాల్లో అవకాశాలను చూసుకోవడం ఉత్తమమని హితవు పలుకుతున్నారు. అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) సైతం అమెరికాకు ఇక ఎగుమతులు తగ్గుతాయన్న ఆందోళననే వ్యక్తం చేస్తున్నది.
భారతీయ రత్నాలు-ఆభరణాల రంగంపై అమెరికా టారిఫ్‌ల ప్రభావం పెద్ద ఎత్తునే ఉంటుందని ఆ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉండటమే ఇందుకు కారణమని చెప్తున్నాయి. జెమ్స్, జ్యుయెల్లరీ ఇండస్ట్రీకి అమెరికానే అతిపెద్ద మార్కెట్ అని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కిరిట్ భన్సాలీ అంటున్నారు. ఏటా 10 బిలియన్ డాలర్లకుపైగా అమెరికాకు భారత్ నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు జరుగుతాయని, ఇది భారతీయ జెమ్స్ అండ్ జ్యుయెల్లరీ ఇండస్ట్రీ మొత్తం విదేశీ వాణిజ్యంలో దాదాపు 30 శాతానికి సమానమని పేర్కొన్నారు. తాజా టారిఫ్‌లతో రవాణా ఖర్చులు, ఎగుమతుల్లో జాప్యం, అధిక ధరలు వ్యాపారావకాశాలను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. మరోవైపు ట్రంప్ ఇదే తీరుతో ముందుకెళ్తే.. ‘మేకిన్ ఇండియా’ పాలసీకి కూడా దెబ్బేనని అఖిల భారత రత్నాలు, ఆభరణాల డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేశ్ రోక్డే హెచ్చరిస్తున్నారు.
అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యాన్నీ.. పెంచిన టారిఫ్‌లు ప్రభావితం చేయనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి దాదాపు 2.34 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ నుంచి జరిగిన ఎగుమతులు 52.40 లక్షల టన్నులుగా ఉన్నాయని దేశీయ బియ్యం ఎగుమతిదారుల సంఘం చెప్తున్నది. దీంతో ట్రంప్ తాజా టారిఫ్‌ల ప్రభావం తక్కువే అయినా.. ఇప్పటికిప్పుడు ఇబ్బందేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే చైనా, వియత్నాం, పాకిస్తాన్, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యం కంటే భారత్ నుంచి ఎగుమతయ్యే బియ్యంపై సుంకాల భారం తక్కువ. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో మన బియ్యానికి డిమాండ్ ఉంటున్నది. కానీ అమెరికా టారిఫ్‌లు ఇప్పుడీ డిమాండ్‌కు గండి కొడుతున్నాయి.
భారత్‌పై విధించిన సుంకాలతో అమెరికాలో ప్రధాన ఔషధాల ధరలు పెరిగిపోతాయని, ఇవి అంతిమంగా అక్కడి ప్రజల వైద్య ఖర్చులను భారం చేస్తాయని, దీర్ఘకాలంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా ప్రభావితం కాగలదని దేశీయ ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) చెప్తున్నది. అయితే ఈ పరిణామాలు అమెరికాకు భారతీయ ఔషధాల ఎగుమతుల్నీ తగ్గించగలవని, దేశీయ ఫార్మా ఇండస్ట్రీ వ్యాపారావకాశాల్ని, లాభాలను దెబ్బతీయగలవన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. అమెరికా హెల్త్‌కేర్ మార్కెట్.. భారత్ నుంచి వచ్చే చౌక ధరల జనరిక్ ఔషధాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)పైనే అధికంగా ఆధారపడి ఉన్నదని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషీ గుర్తుచేస్తున్నారు. కాబట్టి పెరిగే టారిఫ్‌లు అమెరికాతోపాటు భారతీయ ఔషధ పరిశ్రమకూ నష్టమేనని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో పెట్టుబడులు, ఉపాధి కల్పన రెండూ దూరం కాగలవని ఇండస్ట్రీ విశ్లేషకులూ హెచ్చరిస్తున్నారు.
సెమీ-ఫినీష్డ్ రాగితోపాటు రాగి ఆధారిత ఉత్పత్తులపై శుక్రవారం (ఆగస్టు 1) నుంచి 50 శాతం టారిఫ్లుంటాయని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. అమెరికా జాతీయ ప్రయోజనాల రక్షణార్థం ఇక్కడ దిగుమతయ్యే కాపర్‌పై 50 శాతం సుంకాలుంటాయని అందులో పేర్కొన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2024-25) అమెరికాకు భారత్ నుంచి 360 మిలియన్ డాలర్ల విలువైన ప్లేట్లు, ట్యూబులు, ఇతర సెమీ-ఫినీష్డ్ రాగి ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అయితే ఇకపై ఎగుమతయ్యేవి ఖరీదెక్కనున్నాయి. అయితే భారత్ మాత్రం కాపర్ ఓర్పై 2.5 శాతం, రిఫైన్డ్ కాపర్‌పై 5 శాతం, పలు కాపర్ ఉత్పత్తులపై 10 శాతం సుంకాలను వేస్తున్నది.
ట్రంప్ టారిఫ్‌లపై ఎగుమతిదారుల్లో ఆందోళన పెరుగుతున్నది. అమెరికా కొనుగోలుదారులు తమ ఆర్డర్లను వెనుకకు పంపించడం లేదా రద్దు చేసుకోవచ్చన్న అభిప్రాయాలు భారతీయ ఎక్స్‌పోర్టర్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ రకమైన సంకేతాలను అందుకున్నట్టు భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ తెలిపారు. ప్లాస్టిక్, తోలు, పాదరక్షలు.. ఇలా అన్ని రంగాల వ్యాపారావకాశాలు దెబ్బ తింటున్నాయన్న ఆవేదనను వెలిబుచ్చారు.
ఇరాన్ నుంచి పెట్రోలియంను దిగుమతి చేసుకొని, పెట్రోకెమికల్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న 6 భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో ఆల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్, జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్నిక్లాల్ ఎస్ గొసాలియా అండ్ కంపెనీ, పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, కంచన్ పాలిమర్స్ ఉన్నాయి. కాగా, ఈ నిర్ణయంతో అమెరికాలోగానీ, ఆ దేశ పరిధిలోగానీ ఈ సంస్థలకు చెందిన ఆస్తులేవైనా ఉంటే వాటిని ట్రంప్ సర్కారు ఫ్రీజ్ చేయనున్నది. అలాగే అమెరికా పౌరులు వీటిలో పనిచేయరాదు. వీటితో అమెరికా కంపెనీలు ఎలాంటి వ్యాపార లావాదేవీలను పెట్టుకోరాదు. ఉల్లంఘిస్తే వాటిపైనా ఆంక్షలుంటాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వైరం నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా కొరఢా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశంతో డీల్స్ పెట్టుకుంటున్న వాటినీ ట్రంప్ సర్కారు టార్గెట్ చేస్తున్నది.
భారత్‌సహా, ఆయా దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలు బూమరాంగ్ అవుతున్నాయి. వివిధ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి మరి. దీంతో అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నదిప్పుడు. తాజా గణాంకాల ప్రకారం నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జూన్‌లో ధరలు 2.6 శాతం పెరిగినట్టు అక్కడి వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. అంతకుముందు మే నెలలో ఈ పెరుగుదల 2.4 శాతంగా ఉన్నది. నిజానికి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతంలోపే ఉంచాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. కానీ అంతకంతకూ ఎగబాకుతుండటం ట్రంప్ సర్కారునూ కలవరపెడుతున్నది. ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించాలని ఫెడ్ రిజర్వ్‌పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. అయినప్పటికీ ఫెడ్ ససేమిరా అంటున్నది. తాజా ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది.
దేశ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటాం. టారిఫ్‌ల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? అన్నది పరిశీలిస్తున్నాం. రైతులు, కార్మికులు, వ్యాపార-పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలోని ఇతర అన్ని రంగాల ప్రయోజనాలకు భంగం వాటిల్లనివ్వబోము.
-పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి
భారత్ విషయంలో అమెరికా విధానాలు దురదృష్టకర మలుపును తీసుకున్నాయి. టారిఫ్‌లతో దేశీయ వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమలే ఎక్కువగా నష్టపోతాయి. అంతిమంగా రైతులకే ఇబ్బందులు.
-కౌశిక్ బసు, భారతీయ ఆర్థికవేత్త