‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ అంటూ హల్చల్ చేశారు. ట్రంప్ నాకు గొప్ప మిత్రుడంటూ కలరింగ్ ఇచ్చారు.నిజమేననుకొన్నారు అదంతా. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. విశ్వగురువుగా తనకు తాను ప్రచారం చేసుకొనే మోదీ మాట.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు చెల్లుబాటు కాలేదు. సుంకాలు తగ్గించాలంటూ మోదీ స్వయంగా వెళ్లి కలిసినా ప్రయోజనం దక్కలేదు. ఫలితం.. భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అవహేళన చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ, మోదీ మౌనంగానే ఉన్నారు తప్ప, ట్రంప్ వైఖరిని ఎండగట్టలేదు. ఈ పరిణామాలను విశ్లేషిస్తున్న నిపుణులు అమెరికా విషయంలో మోదీ దౌత్యం విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అనుకొన్నదంతా అయ్యింది. భారత్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ అధికార పగ్గాలు చేపట్టగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా రష్యాతో వ్యాపారాన్ని సాకుగా చూపిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా పోల్చారు. ఇండియాకు.. పాకిస్థాన్ చమురు విక్రయించే రోజులు వస్తాయంటూ అవహేళన చేశారు. అయినప్పటికీ, విశ్వగురువుగా ప్రచారం చేసుకొనే ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. అటు ట్రంప్ వ్యాఖ్యలను, చర్యలను ఖండించట్లేదు కూడా. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా టారిఫ్‌ల విషయంలో అమెరికాతో ప్రధాని మోదీ దౌత్యం ఫెయిల్ అయ్యిందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ.. భారత్‌పై అమెరికా టారిఫ్‌ల అంశాన్ని ట్రంప్‌తో ప్రస్తావించడానికి ప్రయత్నించారు. అయితే, మోదీని వారించిన ట్రంప్.. టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపులేదని తెగేసి చెప్పారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధిక సుంకాలు వేస్తుందని, తాము కూడా అలాగే వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. దీంతో మోదీ మరేమీ మాట్లాడలేదని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి.
భారత్‌పై పరస్పర సుంకాలు విధిస్తామంటూ తొలుత ఏప్రిల్ 2ను డెడ్‌లైన్‌గా ట్రంప్ ప్రకటించడంతో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మార్చి 3న అన్నికార్యక్రమాలు రద్దు చేసుకొని హడావిడిగా అమెరికాకు బయల్దేరారు. కొద్దిరోజులపాటు అమెరికా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఒకవైపు గోయల్ అమెరికాతో చర్చలు జరుపుతున్న సమయంలోనే.. సుంకాల విషయంలో వెనక్కి తగ్గబోనని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో యూఎస్-ఇండియా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా నుంచి దిగుమతి అయ్యే ప్రీమియం మోటార్ సైకిళ్లపై 20 శాతం మేర, బోర్బన్ విస్కీ టారిఫ్‌లను 50 శాతం మేర భారత్ తగ్గించింది. అమెరికాకు చెందిన గూగుల్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే యాడ్స్‌పై విధించే 6 శాతం పన్నును రద్దు చేసింది. ఇతర టారిఫ్‌లను సమీక్షించడంతో పాటు రక్షణ పరికరాలను అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేస్తామని హామీనిచ్చింది. అయినప్పటికీ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గని ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ పేరిట అటు అమెరికాలో ఇటు భారత్‌లో పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టి, ట్రంప్ తనకు మంచి మిత్రుడని ప్రచారం చేసుకొన్న మోదీ.. టారిఫ్‌ల విషయంలో సానుకూల ఫలితాలను ఎందుకు సాధించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుంకాల విషయంలో అమెరికాతో ప్రధాని మోదీ దౌత్యం ఫెయిల్ అయ్యిందని అభిప్రాయపడుతున్నారు.
01
పాకిస్థాన్‌తో తమకు వాణిజ్య ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరుదేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయని అన్నారు. అంతటితో ఆగకుండా భారత్‌పైనా ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో భారత్‌కు పాక్ చమురు విక్రయించవచ్చంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, మోదీ ఖండించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా-భారత్‌లను ఉద్దేశిస్తూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకొన్నా తనకు సంబంధం లేదన్నారు. ఈ క్రమంలో రష్యాతో పాటు భారత్ అర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. ఇరు దేశాలు వారి ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకొంటున్నాయని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ట్రంప్‌ను డెడ్ హ్యాండ్‌గా అభివర్ణించారు. అయితే, భారత్ తరుఫున మోదీ ఏమాత్రం నోరు మెదపకపోవడం విమర్శలకు దారితీస్తున్నది.
ట్రంప్ మోదీకి పెద్ద చిక్కునే తెచ్చి పెట్టారు. టారిఫ్‌ల నిర్ణయంతో ఆయనకు పెద్ద నష్టం జరిగినట్టే. నాకు గుర్తున్నంత వరకూ ఇదే అతి పెద్ద డ్యామేజీ. టారిఫ్‌ల నిర్ణయంతో అమెరికా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోతాయని నేను అనడంలేదు గానీ, ఇకపై, అమెరికాతో చేసుకొనే ప్రతీ డీల్‌లో భారత్ ఆచితూచి వ్యవహరిస్తుందని మాత్రం చెప్పగలను.