Air India Crash | అహ్మదాబాద్‌లో గతవారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ ఏ-171 విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సమీపంలోని ఓ బిల్డింగ్‌పై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన నేపథ్యంలో దేశంలో విమానాల భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్స్ సమీపంలో విమానాల రాకపోకలకు ఆటంకంగా మారే నిర్మాణాలపై (New Rules For Structures Near Airports) కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నూతన ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
‘ఎయిర్‌క్రాఫ్ట్ (అడ్డంకుల తొలగింపు) నిబంధనలు-2025’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఎయిరోడ్రోమ్ జోన్ పరిధిలో పరిమితికి మించి ఎత్తైన భవనాలు, చెట్లను కూల్చడం.. లేదా వాటి ఎత్తును తగ్గించాల్సి ఉంటుంది. విమాన మార్గాల్లో అడ్డంకుల వల్ల సంభవించే ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. నోటిఫైడ్ విమానాశ్రయాల చుట్టూ అనుమతించదగిన ఎత్తు పరిమితులను మించి ఉన్నట్లు గుర్తించిన ఏ నిర్మాణానికైనా సంబంధిత అధికారి ముందుగా నోటీసులు జారీ చేస్తారు.
నోటీసు అందుకున్న 60 రోజుల్లోగా ఆస్తి యజమానులు తమ స్థల ప్రణాళికలు, నిర్మాణ కొలతలకు సంబంధించి కీలక వివరాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలను పాటించకపోతే.. అధికారులే చర్యలు చేపడతారు. నిబంధనలను పాటించని యజమానులకు చెందిన నిర్మాణాలను కూల్చడం, లేదా ఎత్తు తగ్గించడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సరైన కారణాలుంటే మాత్రం మరో 60 రోజుల వరకు గడువు పొడిగించే అవకాశం కూడా ఉంది.
ఇక కూల్చివేత లేదా ఎత్తు తగ్గింపు ఆదేశాలపై ఆస్తి యజమానులు అప్పీలు చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. నిర్దేశిత ఫారం, సహాయక పత్రాలు, రూ.1,000 రుసుముతో ఫస్ట్ లేదా సెకండ్ అప్పీలేట్ అధికారి ముందు వారు తమ వాదనలు వినిపించవచ్చు. భారతీయ వాయుయాన్ అధినియం 2024లోని సెక్షన్ 22 ప్రకారం, అధికారిక ఉత్తర్వులను పాటించిన వారికి మాత్రమే నష్టపరిహారం పొందే అర్హత ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నోటిఫికేషన్ తేదీ తర్వాత నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఏ నిర్మాణాలకు పరిహారం ఉండదు.
Also Read..
Bomb Threat | ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ సిద్ధం.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపులు
Air India | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్.. విశ్లేషణ కోసం విదేశాలకు