Gujarat High Court : చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి ఏ తప్పూ చేయలేదని తేలింది. దీంతో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. అహ్మదాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన బాబు భాయ్ ప్రజాపతిపై 1996లో ఒక కేసు నమోదైంది. అతడు రూ.20 లంచం తీసుకున్నాడని ఫిర్యాదు రావడంతో అవినీతి నిరోధక చట్టం కింద అతడిపై చర్యలు తీసుకున్నారు.
ఆ సమయంలో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో 1997లో సెషన్స్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. వీటిపై 2002లో అభియోగాలు నమోదయ్యాయి. 2003, 2004లో పలు విచారణల అనంతరం అతడు తప్పు చేసినట్లు గుర్తిస్తూ.. కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.3,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పును ప్రజాపతి.. గుజరాత్ హైకోర్టులో సవాలు చేశాడు. దీనిపై అలా 22 ఏళ్లుగా విచారణ జరిగింది. చివరకు ఈ నెల 4న ప్రజాపతి ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టు తీర్పునిచ్చింది. అతడు లంచం తీసుకున్నాడనేందుకు సరైన సాక్ష్యాలు లేనందున నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ప్రజాపతి సంతోషం వ్యక్తం చేశాడు. తన కేసు వాదించిన లాయర్ నితిన్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత అతడు మాట్లాడుతూ.. తన జీవితంలోని కళంకం తొలగిపోయిందని, తను నిర్దోషిగా విడుదలయ్యానని, ఇక తనకు ఏమైనా పర్లేదని వ్యాఖ్యానించాడు.
అయితే, నిర్దోషిగా విడుదలై ఇంటికి చేరుకున్న మరునాడే వృద్ధాప్య సమస్యల కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ప్రజాపతి నిర్దోషిగా ఇంకొంతకాలం బతికుంటే బాగుండేదని ఆయన సన్నిహితులు అన్నారు. అతడు విడుదలైన తర్వాత చాలా సంతోషంగా కనిపించినట్లు చెప్పుకొచ్చారు.