Adani | అదానీ కంపెనీ కుదుర్చుకునే ఏ ఒప్పందాన్ని అయినా భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్నట్టుగానే భావించాలంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి అలీసబ్రీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ వైపు పేదల సొమ్ము కర్పూరంలా కరిగిపోతున్నా.. విదేశాల్లో అదానీ కంపెనీలను కేంద్రం ఎంత గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నదో దీన్నిబట్టి తెలిసిపోతున్నది.
అదానీ ఎవరు? ఒక వ్యాపారి.అదానీ కంపెనీ ఏంటీ? ఓ ప్రైవేటు సంస్థ.ఇప్పటివరకూ.. అందరికీ తెలిసింది ఇదే!అయితే, ఇకపై, అదానీ గ్రూప్‌ను ఓ ప్రైవేటు కంపెనీగా చూడొద్దు. అదానీ కంపెనీ చేసుకొనే ఏ ఒప్పందమైనా.. ఇండియన్ గవర్నమెంట్ చేసుకొన్నట్టే లెక్కించాలి. ఒకవిధంగా భారత ప్రభుత్వమే అదానీ కంపెనీ పరమైనట్టు భావించాలి.
ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. శ్రీలంక విదేశాంగమంత్రి అలీసబ్రీ.
అదానీతో తమ ప్రభుత్వం చేసుకొన్న డీల్‌ను ‘భారత ప్రభుత్వం-శ్రీలంక ప్రభుత్వం’ మధ్య కుదిరిన ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. అంటే, దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొమ్మును కర్పూరంలా కరిగిస్తున ఓ వ్యాపారికి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏ స్థాయిలో అండగా నిలిచిందో.. విదేశాల్లో అదానీ కంపెనీలను ఎంత గొప్పగా కేంద్రం ప్రొజెక్ట్ చేస్తున్నదో అలీసబ్రీ వ్యాఖ్యలను బట్టి బుద్ధిజీవులు అర్థంచేసుకోవాలి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదానీ పడవ మునిగిపోతున్నది. కష్టపడి సంపాదించిన తమ సొమ్ము కరిగిపోతుండటాన్ని చూసి లక్షలాదిమంది ప్రజలు లబోదిబోమంటున్నారు. అయితే, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న శ్రీలంక ప్రభుత్వానికి ఈ పరిణామాలు ఏ మాత్రం భయం కలిగించడంలేదు. లంకలో అదానీ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులకు వచ్చిన నష్టమేమీలేదని అక్కడి ప్రభుత్వం ఎంతో ధీమాగా ఉన్నది. దీనికి కారణం.. కేంద్రంలోని బీజేపీ సర్కారేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదానీ గ్రూప్‌ను ఏకంగా ఇండియన్ గవర్నమెంట్‌గా అక్కడ మోదీ సర్కారు ప్రొజెక్ట్ చేయడమే లంక ప్రభుత్వం నిశ్చింతగా ఉండటానికి వెనకున్న ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఇవి తలాతోకా లేని ఆరోపణలు కాదు. జీ-20 సదస్సులో భాగంగా విదేశాంగ మంత్రుల భేటీ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రీలంక విదేశాంగమంత్రి అలీ సబ్రీ ‘ది హిందూ’ వార్తాపత్రికతో ఆదివారం మాట్లాడారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ను ఒకరకంగా భారత ప్రభుత్వంతో ఆయన పోల్చడం సంచలనంగా మారింది.
శ్రీలంకలో అదానీ గ్రూప్ చేపట్టిన కొలంబో పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టు, నార్తర్న్ శ్రీలంక విండ్ పవర్ ప్రాజెక్టులను అదానీ గ్రూప్ కచ్చితంగా పూర్తి చేస్తుందని అలీ సబ్రీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులపై తమ ప్రభుత్వం ఏ మాత్రం ఆందోళనగా లేదని పేర్కొన్నారు. ఒకరకంగా ఈ ప్రాజెక్టులు ‘భారత ప్రభుత్వం-శ్రీలంక ప్రభుత్వం’ మధ్య కుదిరిన ఒప్పందాలుగా పరిగణించాలంటూ చెప్పుకొచ్చారు. తద్వారా అదానీ గ్రూప్‌నకు ఈ ప్రాజెక్టులు కట్టబెట్టడంలో ప్రధాని మోదీ రాయబారం నడిపినట్టు పరోక్షంగా గుర్తుచేశారు. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలు సుమారు రూ. 12 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆ గ్రూప్ కంపెనీలు చేపట్టిన పలు ప్రాజెక్టులపై నీలినీడలుకమ్మాయి. ఇదే అంశంపై అలీ సబ్రీని ‘ది హిందూ’ మీడియా సంస్థ ప్రశ్నించింది. దీనికి ఆయన జవాబిస్తూ.. ‘లంకలో చేపట్టిన ప్రాజెక్టులను అదానీ గ్రూప్ పూర్తిచేస్తుందని చాలా నమ్మకంగా ఉన్నాం. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్, పోర్ట్స్‌ను నిర్వహిస్తున్నది. రైల్వేస్, పునరుత్పాదక శక్తి రంగాల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టింది. దీంతో ఆ గ్రూప్‌ను పెద్ద కంపెనీగా భావిస్తున్నాం. ఇక, స్టాక్మార్కెట్లో జరిగేవి కొత్తేం కాదు. దీనిపై మేం ఆందోళనపడట్లేదు’ అని అన్నారు. లంకలో కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్‌ను భారత్‌లోని మోదీ సర్కారు ఎంపిక చేసి తమకు ప్రపోజల్స్ పంపించిందని, అలా మాకు అన్నివిధాలుగా సౌకర్యంగా ఉన్న ఆ కంపెనీనే ఈ ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసుకొన్నట్టు ఆయన చెప్పారు. ఒకవిధంగా ఈ డీల్ ‘ప్రభుత్వం-ప్రభుత్వం మధ్య (జీ2జీ) కుదిరిన ఒప్పందం’గా ఆయన అభివర్ణించారు.
శ్రీలంక ఉత్తరతీర ప్రాంతంలోని మన్నార్‌లో 500 మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్, పవన విద్యుత్తు ప్రాజెక్టును అదానీ గ్రూప్‌నకు ఏకపక్షంగా కట్టబెట్టడంపై ఆ దేశంలో వివాదం రేగింది. ప్రధాని మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తేవడంతోనే ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు ఈ ప్రాజెక్టును కేటాయించారనేది ప్రధాన ఆరోపణ. సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఫెర్డినాండో కిందటేడాది ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ విషయం బయటకు వచ్చింది. గొటబయ స్వయంగా తనతో ఈ విషయం చెప్పారని ఫెర్డినాండో వెల్లడించారు. ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలం వీడియోను శ్రీలంక టీవీ చానల్ న్యూస్ ఫస్ట్ ప్రసారం చేయటంతో కలకలం రేగింది.
అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో వనరుల దోపిడీపై పక్కా ఆధారం బయటపడటంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కాంట్రాక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీఈబీ ఉద్యోగులు, ఇంజినీర్లు ఏకంగా సమ్మె నోటీస్ ఇచ్చారు. ఎంవోయూ సమయంలో యూనిట్ విద్యుత్తును 6.50 అమెరికన్ సెంట్లకు సీఈబీకి విక్రయించేలా అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదిరింది. ఈ ధరను అదానీ గ్రూప్ 7.55 సెంట్లకు పెంచేసింది. ఈ ప్లాంటును అంతర్జాతీయ పోటీ బిడ్ల ద్వారా అప్పగిస్తే 4 సెంట్లకే యూనిట్ విద్యుత్తు వచ్చేదని, ఇప్పుడు దాదాపు రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తున్నదని శ్రీలంక విద్యుత్తు ఇంజినీర్లు మండిపడుతున్నారు. పోటీ లేకపోవటంతో అదానీ గ్రూప్‌కు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని అంచనా వేశారు. ఇప్పుడు అదానీ గ్రూప్‌తో ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంగా అలీ సబ్రీ అభివర్ణించడాన్ని చూస్తే.. మిత్రుడు అదానీ కోసం మోదీ దౌత్య సంబంధాలను ఏ మేరకు తాకట్టు పెట్టారో, స్నేహితుడికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు విదేశాల్లో ఓ ప్రైవేటు కంపెనీని ఎంత గొప్పగా చిత్రీకరించారో.. లంక మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది.
తన ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రతిష్టను, దౌత్య సంబంధాలను ఏ విధంగా తాకట్టు పెట్టారో? లంకలో అదానీకి ప్రాజెక్టులు రావడానికి కేంద్రం కృషి ఏ స్థాయిలో ఉన్నదో? దోస్తుకు ప్రయోజనం చేకూర్చేందుకు.. అతని కంపెనీని విదేశాల్లో ప్రధాని ఏ స్థాయిలో ఎక్కువ చేసి చూపెడుతున్నారో.. తాజాగా బట్టబయలైంది.
అలీసబ్రీ తాజా వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అవకతవకల ఆరోపణలను ఎదుర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలను మూటగట్టుకొన్న అదానీ కంపెనీలను లంక విదేశాంగ మంత్రి వెనుకేసుకొస్తున్నట్టు మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదానీ గ్రూప్‌నకు బీజేపీ సర్కారు దన్నుగా ఉన్నట్టు స్ఫురణకు వచ్చేలా అలీసబ్రీ వ్యాఖ్యలు ఉన్నాయని, అందుకే, ఆయన అదానీ కంపెనీపై తమ ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉన్నట్టు ధీమాగా చెబుతున్నారని పేర్కొంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీతో చేసుకొన్న డీల్‌ను రెండు సార్వభౌమ ప్రభుత్వాల మధ్య ఒప్పందంగా అభివర్ణించడం వెనుక ఇదే కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే, లంకలో చేపట్టనున్న కీలక ప్రాజెక్టులను అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టడంలో మోదీ.. అక్కడి ప్రభుత్వంపై ప్రత్యక్షంగా ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు అలీసబ్రీ చేసిన తాజా వ్యాఖ్యలు రుజువు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.
అదానీ ప్రాజెక్టులను ‘ప్రభుత్వం-ప్రభుత్వం’ మధ్య కుదిరిన డీల్‌గా శ్రీలంక విదేశాంగమంత్రి అభివర్ణించడంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ పేర్కొంటున్న అమృత్‌కాల్‌ను ‘ఏ మిత్ కాల్’గా అభివర్ణించారు. ఈ కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్’ అనే కొత్త పథకాన్నితీసుకొచ్చినట్టు వ్యంగ్యంగా పేర్కొన్నారు.