Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) తూగుదీపను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara Prison) నుంచి బళ్లారిలోని జైలుకు అధికారులు తరలించారు. గురువారం ఉదయం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి.తంగప్ప ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య నటుడిని బళ్లారి జైలుకు (Ballari Prison) తీసుకెళ్లారు.
అభిమాని రేణుక స్వామి (Renukaswamy) హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, జైల్లో విచారణ ఖైదీగా ఉన్న నటుడికి రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఇటీవలే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
ఇటీవలే దర్శన్ జైలులోని రౌడీషీటర్లతో జల్సాగా టీ తాగుతూ, సిగరెట్ కాల్చుతూ ఆనందంగా గడుపుతున్నట్లు ఓ ఫొటో బయటపడింది. అంతేకాకుండా ఆయన జైలు నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఓ వీడియో కూడా వైరల్ అయింది. వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. దర్శన్‌కు రాజ భోగాలపై మూడు కేసులను నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ బీ దయానంద చెప్పారు. ఈ నేపథ్యంలోనే దర్శన్‌ను పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. మిగతా నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించినట్లు తెలిసింది.
Also Read..
Gujarat Rains | గుజరాత్ వరదల్లో చిక్కుకుపోయిన భారత మహిళా క్రికెటర్.. రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు
Ajith Kumar | కారులో గంటకు 234 కి.మీల వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్.. వీడియో
Harish Rao | నవ కాంతులు విరజిమ్ముతున్న గొప్ప వెలుగు తెలుగు: హరీశ్‌రావు