Eknath Shinde | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా ( Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం జరిగిన కామెడీ షోలో కమ్రా మాట్లాడుతూ.. థాణే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడని, అతడు దేశద్రోహి (gaddar) అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏక్నాథ్ షిండే తొలిసారి స్పందించారు. కమెడియన్ వేసిన సెటైర్ తనకు అర్థమైందని, అయితే దేనికైనా పరిమితి ఉండాలని వ్యాఖ్యానించారు.
బీబీసీ మరాఠీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడుతూ.. ‘ప్రతీ వ్యక్తి ఒక నిర్దిష్ట స్థాయిని కొనసాగించాలి. లేదంటే చర్య ప్రతిచర్యకు కారణమవుతుంది. భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికీ తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) ఇచ్చింది. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. నాపై ఇలాంటి సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లు ఉంది’ అని షిండే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమని.. కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి ఇలా తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు.
‘ఇలాంటి పనులు చేయడానికి ఆయన ఎవరి నుంచి సుపారి తీసుకుంటారు..? ప్రజా స్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం. కానీ ఒకరి ఆదేశం మేరకు మరొకరి గురించి తప్పుగా మాట్లాడటం ఎంత వరకు సరైంది..? నా గురించి మర్చిపోండి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, పారిశ్రామికవేత్తల గురించి ఏం మాట్లాడారో చూడండి’ అని గతంలో కామ్రా చేసిన వ్యాఖ్యలను షిండే ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా జర్నలిస్ట్ అర్బాబ్ గోస్వామితో కునాల్ కమ్రా ఘర్షణను కూడా ఈ సందర్భంగా షిండే గుర్తు చేశారు. జర్నలిస్ట్‌తో గొడవ పడి విమాన ప్రయాణ నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కమ్రాను వాతావరణాన్ని కలుషితం చేసే, శాంతి భద్రతల పరిస్థితిని ప్రభావితం చేసే వ్యక్తిగా అభివర్ణించారు.
షిండేపై కమెడియన్ కునాల్ వ్యాఖ్యలు
ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ది హాబిటాట్ కామెడీ క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కునాల్ కమ్రా దిల్‌తో పాగల్ హై పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండే ను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇది షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి, ధ్వంసం చేశారు. తక్షణమే కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కునాల్ కమ్రా వ్యాఖ్యలు దుమారం రేగడంతో శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ .. కునాల్ కమ్రా సహా రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రేలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు ప్రణాళికతోనే షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కునాల్ క్షమాపణ చెప్పాలని సీఎం ఫడ్నవీస్ సైతం డిమాండ్ చేశారు.
Also Read..
షిండేపై కమెడియన్ కునాల్ వ్యాఖ్యల దుమారం
Mamata Banerjee | లండన్ పార్క్‌లో చీర, రబ్బరు చెప్పులతో దీదీ జాగింగ్.. వీడియో వైరల్
Canada | మా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం.. న్యూ ఢిల్లీపై మరోసారి నోరుపారేసుకున్న కెనడా