ముంబై. మార్చి 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థాణే నుంచి వచ్చిన ఓ నాయకుడు.. బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడని, అతడు దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. ముంబైలోని ఖార్ ప్రాంతంలోని ది హాబిటాట్ కామెడీ క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కునాల్ కమ్రా దిల్‌తో పాగల్ హై పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండే ను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు.
ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇది షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి, ధ్వంసం చేశారు. తక్షణమే కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కునాల్ కమ్రా వ్యాఖ్యలు దుమారం రేగడంతో శివసేన యువసేన ప్రధాన కార్యదర్శి రాహుల్ కనాల్ .. కునాల్ కమ్రా సహా రాహుల్ గాం ధీ, ఆదిత్య ఠాక్రేలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు ప్రణాళికతోనే షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కునాల్ క్షమాపణ చెప్పాలని సీఎం ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.