Kangana Ranaut | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని లక్ష్యంగా చేసుకుని స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) వేసిన జోకులపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రంగా స్పందించారు. కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఒకరిని అగౌరవపరచడం సరికాదన్నారు. అంతేకాదు, ఈ వివాదానికి కారణమైన వేదికను కూల్చడం చట్టబద్ధమైన చర్య అని పేర్కొన్నారు. అయితే, గతంలో తనపై తీసుకున్న చర్యమాత్రం చట్టవిరుద్ధం అని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘2 నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మన సమాజం ఎక్కడికి వెళుతోంది..? మాట్లాడింది ఎవరైనా కావొచ్చు. కానీ, ఒకరిని అవమానించడం, వారి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరైందికాదు. గౌరవమే సర్వస్వం అని భావించే వ్యక్తిని మీరు కామెడీ పేరుతో అవమానిస్తున్నారు. కామెడీ పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఆ వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగింది. కానీ, నా విషయంలో మాత్రం చట్టవిరుద్ధంగానే జరిగింది’ అని కంగన వ్యాఖ్యానించారు.
కాగా, షిండేను లక్ష్యంగా చేసుకొని కమ్రా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ముంబై స్టూడియోను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసం తర్వాత బీఎంసీ ఉద్యోగులు భారీ పరికరాలతో అక్కడికి చేరుకొని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. స్టూడియో కూల్చడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన నేపథ్యంలో కంగన ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో కంగన రనౌత్, అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే భయంగా ఉందంటూ కంగన వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో మహా ప్రభుత్వం, కంగన మధ్య కొన్ని రోజులపాటూ మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో ముంబై బాంద్రాలోని నటి కార్యాలయంలోని కొంత భాగాన్ని బీఎంసీ కూల్చివేసింది.
Also Read..
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
“షిండేపై కమెడియన్ కునాల్ వ్యాఖ్యల దుమారం”
“Eknath Shinde | షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమన్న శివసేన కార్యకర్తలు”
“Devendra Fadnavis | షిండేపై కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఖండించిన సీఎం ఫడ్నవీస్”