Devendra Fadnavis | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ (Comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది. కామెడీ షోలో షిండేను దేశ ద్రోహిగా పేర్కొంటూ ఓ పాట కూడా పాడారు. దీంతో మహా రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కమెడియన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తాజాగా స్పందించారు.
కామెడీ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కమ్రా తీరును తీవ్రంగా ఖండించారు. ‘నేను హాస్యానికి వ్యతిరేకం కాదు. అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి దిగజారుడు హాస్యం, డిప్యూటీ సీఎంను అగౌరవపరచడం సరికాదు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు.
ఖార్ (Khar) ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహా రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ దేశ ద్రేహి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కునాల్ కా కమల్’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్తా వివాదాస్పదమైంది. కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు కొందరు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది.
Also Read..
Eknath Shinde | షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమన్న శివసేన కార్యకర్తలు
Rajinikanth | ఉగ్రవాదులు సముద్రం ద్వారా చొరబడతారు.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రజనీకాంత్
Dia Mirza | రియాకు మీడియా క్షమాపణలు చెప్పాలి.. దియా మీర్జా డిమాండ్