IND vs PAK : పాకిస్థాన్ (Pakistan) ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ (Asim Iftikar Ahmed) కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా ఐక్యరాజ్యసమితి (UNO) లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని (Harish Parvathaneni) తీవ్రంగా స్పందించారు. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కేంద్రపాలిత ప్రాంత భాగం భారత్ (India) లో అంతర్భాగమని, ఎప్పటికీ విడదీయలేనిదని అన్నారు. దీనికి విరుద్ధంగా చేసే వాదనలకు చారిత్రక ఆధారాలు లేవని చెప్పారు. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార వాదనలు ఈ వాస్తవాన్ని మార్చలేవని అన్నారు. ఐరాస వేదికలను పాకిస్థాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్-బల్టిస్థాన్లో జూన్ 7న ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని స్పష్టంచేసింది. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎన్నికల నాటకానికి తెరలేపిందని ఆరోపించింది. ఆక్రమిత ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. అయితే గిల్గిట్-బల్టిస్థాన్ ఎన్నికలపై భారత్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తోసిపుచ్చింది. భారత్ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నది.