సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్షేత్రస్ధాయి నేతలను తమ పార్టీలోకి రప్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఆప్ కసరత్తు సాగిస్తోంది. ఇక బీజేపీ, ఆప్ నుంచి ఇరు పార్టీల్లోకి వలసలు ఊపందుకున్నాయి.
ఈ నెల ఆరంభంలో దాదాపు 25 మందికి పైగా బీజేపీ నేతలు కాంగ్రాలో కాషాయ పార్టీని వీడి ఆప్‌లో చేరారు. మరోవైపు ఆప్ అగ్రనేతలు పలువురు బీజేపీ గూటికి చేరారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ క్షేత్రస్దాయి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటామని ఆప్ నేత సత్యేందర్ జైన్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కేవలం అగ్రనేతలే మిగులుతారని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు తమ పార్టీలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంగ్రాలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ర్యాలీ నేపధ్యంలో జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో ఉనికి చాటాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర పర్యటనలతో హోరెత్తిస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయన టూర్లు సాగుతాయని హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రజలు మూడో పార్టీకి అవకాశం, గౌరవం ఇవ్వరని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌ను ఢిల్లీ మోడల్‌తో పోల్చడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల సామాజిక, రాజకీయ పరిస్ధితులు భిన్నమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో తిరిగి కాషాయ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.