One Nation One Election : ఒక దేశం ఒకే ఎన్నికకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల కిందట నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ప్రకటించారని, కానీ కాషాయ పార్టీ మహారాష్ట్ర, జార్ఖండ్‌లను పక్కనపెట్టి కేవలం హరియాణ, జమ్ము కశ్మీర్ ఎన్నికలకే మొగ్గుచూపిందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లోనే వారు ఒకేసారి ఎన్నికలు జరిపించలేకుంటే దేశం మొత్తం మీద ఒకేసారి ఎన్నికలను వారు ఎలా నిర్వహిస్తారని చెప్పారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పదవీకాలం మనుగడ సాధించలేకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు.
ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా అని ఆప్ ఎంపీ ప్రశ్నించారు. రాష్ట్రాలను అస్ధిరపరిచే ఎత్తుగడ కాక ఇది మరేంటని ఆయన నిలదీశారు. కాగా, జమిలి ఎన్నికల(One Nation, One Election) నిర్వహణకు లైన్ క్లియర్ అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్‌లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్టును ఇవాళ కేంద్ర క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టింది. వంద రోజుల మోదీ సర్కార్ పాలన సందర్భంగా ఈ రిపోర్టును ముందుకు తీసుకువచ్చారు.
Read More :