Aadhaar | న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఆధార్‌ను స్పష్టమైన పౌరసత్వ రుజువుగా పరిగణించలేమంటూ భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) తీసుకున్న వైఖరి సరైనదేనంటూ సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఓటరు పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్‌లో ఓటరు జాబితాకు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పౌరసత్వానికి చెందిన నిర్దిష్టమైన రుజువుగా ఆధార్‌ని ఆమోదించలేమని ఈసీ చెప్పడం సరైనదేనని, పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని జస్టిస్ కాంత్ పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కి తెలిపారు.
అయితే పౌరసత్వ తనిఖీ ప్రక్రియను నిర్వహించే అధికారం ఈసీకి ఉందా అన్నదే ఇక్కడ మొదటి ప్రశ్నని ధర్మాసనం పేర్కొంది. వారికి ఆ అధికారం లేదంటే ఇక అంతా ముగిసినట్లేనని, అదే వారికి(ఈసీ) అధికారం ఉంటే సమస్య ఏమీ ఉండదని జస్టిస్ కాంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్రియ భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపునకు దారితీయగలదని, ముఖ్యంగా అవసరమైన పత్రాలను సమర్పించలేని వారి పేర్లు తొలగింపునకు గురవుతాయని సిబల్ వాదించారు.
2003 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు కూడా తాజాగా ఫారాలను భర్తీ చేయాల్సి ఉంటుందని, తమ చిరునామాలో ఎటువంటి మార్పు లేని వారి పేర్లు కూడా తొలగింపునకు గురయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ సమర్పించిన బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 7.24 కోట్ల మంది ఫారాలు సమర్పించారు. దాదాపు 65 లక్షల పేర్లను మరణాలు లేదా వలసలపై ఎటువంటి దర్యాప్తు లేకుండా తొలగించారని ఆయన వాదించారు. తాము ఎటువంటి సర్వే జరపలేదని ఈసీ తన అఫిడవిట్లో అంగీకరించినట్లు ఆయన చెప్పారు. ఈ 65 లక్షల సంఖ్య ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని సిబల్‌ని ధర్మాసనం ప్రశ్నించింది.
వాస్తవాలను ధ్రువీకరించుకున్నారా లేక అంచనాలు వేసుకుని ఆందోళనతో ఈ సంఖ్య చెబుతున్నారా అని జస్టిస్ కాంత్ ప్రశ్నించారు. ఫారాలు సమర్పించిన వారు ఓటర్ల జాబితాలో ఇప్పటికే ఉన్నారని ఆయన తెలిపారు. 2025 జాబితాలో 7.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 4.9 కోట్ల మంది 2003 జాబితాలో ఉన్నారని సిబల్ చెప్పారు. 22 లక్షల మంది మరణించినట్లు ఈసీ తెలిపిందని ఆయన చెప్పారు. ఇతర పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ మరణించిన లేదా చిరునామా మార్పు కారణంగా తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ కోర్టులో కాని తన వెబ్సైట్లో కాని వెల్లడించలేదని తెలిపారు.
బూత్ స్థాయి కార్యకర్తలకు కొంత సమాచారం ఇచ్చామని ఈసీ చెప్పిందని, కాని జాబితాను ఎవరికీ ఇవ్వవలసిన అవసరం తమకు లేదని ఈసీ చెబుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ ఆధార్, రేషన్ కార్డుతోపాటు ఫారాన్ని సమర్పించిన ఓటరుకు చెందిన వివరాలను ఈసీ తనిఖీ చేయవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ద్రువీకరణ పత్రాలు లేని వారికి నోటీసు ఇవ్వడంపై తమకు స్పష్టత ఇవ్వాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది.
ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి భారత పౌరుడు కాలేడని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. చట్టవిరుద్ధంగా భారత్‌లోకి చొరబడిన ఓ బంగ్లాదేశీయుడికి బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫోర్జరీ చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలతో భారత్‌లో దశాబ్దానికి పైగా నివాసం ఉంటున్నట్లు నిందితుడిపై అభియోగాలు నమోదయ్యాయి.
భారత పౌరుడు ఎవరు, పౌరసత్వం ఎలా లభిస్తుంది వంటి వివరాలు పౌరసత్వ చట్ట నిబంధనలు తెలియచేస్తాయని, ఆధార్, పాన్ కార్డు, ఓటరు ఐడీ వంటి ధ్రువీకరణ పత్రాలు కేవలం గుర్తింపు కోసం లేదా సేవల వినియోగం కోసం మాత్రమే ఉపయోగపడతాయని జస్టిస్ అమిత్ బోర్కర్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టబద్ధమైన పాస్‌పోర్టు లేదా ప్రయాణ పత్రాలు లేకుండా అక్రమంగా భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీ జాతీయుడు బాబు అబ్దుల్ రవూఫ్ సర్దార్కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.