Lok Sabha Elections | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బీజేపీకి ఏకంగా 8 సార్లు ఓటేసినట్టు చూపిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అతను ఫరూకాబాద్ బీజేపీ అభ్యర్థి ముకేశ్ రాజ్‌పుత్‌కు ఓ పోలింగ్ బూత్‌లో ఓటేసినట్టు వీడియోలో ఉన్నది. ఓటేసిన ప్రతిసారి ఆ యువకుడు చేతి వేళ్లతో లెక్కపెడుతూ సంకేతాన్ని చూపడం వీడియోలో కనిపిస్తున్నది.
ఈ వీడియోను ఆ యువకుడే తీసినట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగించేలా జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ‘ఇది తప్పు అని భావిస్తే.. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. బీజేపీ బూత్ కమిటీ ఒక లూట్ కమిటీ అని విమర్శించారు. ఇది మేల్కోవాల్సిన సమయమని కాంగ్రెస్ పేర్కొన్నది.
ఏఆర్వో ప్రతీత్ ఫిర్యాదు మేరకు యూపీ పోలీసులు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో అంశాన్ని ఈసీ కూడా పరిగణనలోకి తీసుకొన్నది. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు యూపీ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.