Train Engine | న్యూఢిల్లీ: పొలాల మధ్యలో రైలు ఇంజిన్ కనిపించడంతో స్థానికులు, అధికారులు అవాక్కయ్యారు. అది అక్కడికి ఎలా వచ్చిందబ్బా! అని ఆశ్చర్యపోయారు. బీహార్లోని గయ జిల్లా, రఘునాథ్పుర్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వజీర్గంజ్ స్టేషన్-కొల్హన హాల్ట్ మధ్యలో జరిగిన ఈ సంఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. బోగీలు లేకుండా ఇంజిన్ మాత్రమే ప్రయాణించిందని, నియంత్రణ కోల్పోయి, పట్టాలు తప్పడంతో, పొలాల మధ్యలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు దీనిని ఆసక్తిగా గమనిస్తూ, ఫొటోలు తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రైలింజన్లు భూమిని దున్నడానికి వస్తున్నాయని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే రిలీఫ్ టీమ్ ఈ ఇంజిన్ను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నది.
దేశంలో మరో ఆరు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. జార్ఖండ్, ఒడిశా, బీహార్, యూపీల నుంచి నడిచే ఈ రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం రాంచీ విమానాశ్రయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. వాస్తవానికి ఈ రైళ్లను ఆయన టాటానగర్ స్టేషన్ నుంచి ప్రారంభించాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక ఆయన హెలికాప్టర్ బయలుదేరలేదు.
ఈ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్లు టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా రూట్లలో నడుస్తాయి. డియోఘర్, వారణాసి, కాళీఘాట్, బెలూర్ మఠం (కోల్కతా) తదితర పుణ్యస్థలాలకు వెళ్లేందుకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడతాయని రైల్వే శాఖ తెలిపింది.