MSP | న్యూఢిల్లీ, డిసెంబర్ 17: పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి మంగళవారం సిఫారసు చేసింది. దీని వల్ల రైతుల ఆత్మహత్యలను తగ్గించడంతో పాటు వారికి ఆర్థిక స్థిరత్వం కల్పించవచ్చని తెలిపింది. అలాగే పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం రైతులకు ఏటా అందిస్తున్న రూ.6 వేల ఆర్థిక సాయాన్ని రూ.12 వేలకు పెంచాలని ప్రతిపాదించింది. వ్యవసాయం, పశు సంవర్ధకం, ఆహార ప్రాసెసింగ్‌పై ఏర్పాటైన ఈ ప్యానెల్ ఈ మేరకు పార్లమెంట్‌కు సమగ్ర నివేదిక సమర్పించింది. ‘వీలైనంత త్వరగా ఎంఎస్పీని చట్టబద్ధంగా అమలు చేయడానికి ఒక మార్గ సూచిని రూపొందించాలని వ్యవసాయ శాఖకు ప్యానెల్ గట్టిగా ప్రతిపాదించింది’ అని నివేదిక పేర్కొంది.
పంట వ్యర్థాల నిర్వహణకు పరిహారం అందించడం, వ్యవసాయ కూలీలకు కనీస జీవన వేతనాల అమలు కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు, రైతులు, రైతు కూలీల కోసం రుణ మాఫీ పథకం ప్రవేశపెట్టడం తదితర సిఫారసులను చేసింది. ఎంఎస్పీ ద్వారా వచ్చే ఆదాయం రైతులను వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా చేస్తుందని కమిటీ వివరించింది. ప్రతి పంట కాలం తర్వాత ప్రభుత్వం పార్లమెంట్లో ఎంఎస్పీకి పంటలను అమ్ముతున్న రైతుల సంఖ్యను, ఎంఎస్పీకి-మార్కెట్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రకటించాలని పార్లమెంటరీ కమిటీ కోరింది.