Uttar Pradesh | లక్నో: మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే దురాశపరుడి వల్ల ఓ వ్యక్తి గంగా నదిలో మునిగి, ప్రాణాలు కోల్పోయారు. మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్‌లోని నానామావ్ ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అనుకోకుండా ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు.
అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్ కాశ్యప్ సహాయపడటానికి ముందుకు వచ్చాడు. అయితే ఆన్లైన్లో రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు తాను ఆయనను కాపాడబోనని చెప్పాడు. సింగ్ నదిలో కొట్టుకుపోతూ ఉంటే, రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు సునీల్ వేచి చూశాడు. దీంతో ఆయన నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
రాంచీ: జార్ఖండ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర కలకలం రేపింది. ఆగస్టు 22 నుంచి 30 వరకు వివిధ కేంద్రాల్లో నిర్వహించిన టెస్ట్‌ల్లో 11 మంది అభ్యర్థులు చనిపోయారని జార్ఖండ్ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటించింది.
మరణాలపై దర్యాప్తు చేపట్టామని ఉన్నతాధికారి అమోల్ వీ హోమ్కార్ తెలిపారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టనందువల్లే పలువురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.