బెంగళూరు, సెప్టెంబర్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న వ్యవసాయ, రైతు అనుకూల విధానాలు ఇతర రాష్ర్టాల రైతులను ఆకర్షిస్తున్నాయి. ఓవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పండిన పంటకు సరైన మద్దతు ధరను ఇవ్వకపోగా కరెంటును ప్రైవేటీకరించి సేద్యపు బావులకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నించడం.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు, సాగునీరు ఇవ్వడమే కాకుండా పండిన పంటను నేరుగా గ్రామాలకు వెళ్లి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం వారిని ఆలోచింపజేస్తున్నది. తమకు కూడా తెలంగాణ మాడల్ వ్యవసాయ విధానం కావాలంటూ ఆయా రాష్ర్టాల్లో రైతులు ఆందోళన బాటపడుతున్నారు.
ఈ దిశగా కర్ణాటక రైతులు రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణ మాదిరిగా రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని, విద్యుత్తును ప్రైవేటీకరించే చట్టాన్ని రద్దు చేయాలని, సేద్యపు బావులకు ఉచిత విద్యుత్తును అడ్డుకొనే కుట్రలకు తెరదించాలని డిమాండ్ చేస్తూ కన్నడ రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
బెంగళూరు రైల్వేస్టేషన్ నుంచి విధానసభ వరకు జరిగిన ప్రదర్శనలో అన్నదాతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు రైతు నాయకులు కర్ణాటక రైతులకు సంఘీభావం తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించగా భారీ సంఖ్య లో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతు నేతలను పోలీసులు అరెస్టు చేసి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు.
స్వామినాథన్ సిఫారసులు అమలుచేయాలి
ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచాలని, చెరకుకు కనీసం రూ.3,500 ఖరారు చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, తెలంగాణ మాడల్ రైతు పథకాలను ప్రతి రాష్ట్రంలో అమలుచేయాలని, తెలంగాణ మాదిరిగా రైతుబంధు, రైతుబీమా అమలుచేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ వెలుపల రైతులు చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది అన్నదాతల కుటుంబాలకు కేంద్రం వెంటనే పరిహారాన్ని చెల్లించాలి కోరారు.
కరోనా లాక్‌డౌన్‌తోపాటు అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులకు, దేశవ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన మూడున్నర లక్షలమంది రైతుల కుటుంబాలకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ మాడల్ రైతు పథకాలు కావాలని ప్లకార్డులను ప్రదర్శించారు. అరెస్టయిన వారిలో కర్ణాటక రైతు సంఘం నేత కలబుర్గి శాంతకుమార్, జగ్జీత్సింగ్ దల్లేవాల్ (పంజాబ్), శివకుమార్ కక్కాజీ (మధ్యప్రదేశ్), దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకులు కోటపాటి నర్సింహానాయుడు, నల్లమల్ల వెంకటేశ్వర్రావు, నారాయణరెడ్డి, దైవశిఖామణి, రామన్ గౌండర్ (తమిళనాడు), కేవీబీ రాజు (కేరళ) ఉన్నారు.