ఉత్తరకాశీ, జూన్ 5: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ ఘటన హిమాలయాల్లోని 4,100-4400 అడుగుల ఎత్తున ఉన్న సహస్త్రల్ అల్పైన్ సరస్సు సమీపంలో జరిగినట్టు బాధితులను రక్షించిన భారత వైమానిక దళం అధికారులు బుధవారం తెలిపారు. ఐదు మృతదేహాలను, ముగ్గురు బాధితులను రెండు హెలికాప్టర్ల ద్వారా తరలించారు. మిగిలిన వారిని, మృతదేహాలను గురువారం తీసుకువస్తామని చెప్పారు. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరికి చెందిన 22 మంది సభ్యుల బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ప్రారంభించింది. మార్గమధ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా సభ్యులు దారితప్పారు. తర్వాత వీరిలో తొమ్మిది మంది మంచులో కూరుకుపోయి మృతి చెందగా, మిగతా వారిని రక్షించారు.