Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికాసేపట్లో ముగియనుంది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక అనుభవాలనే కాదు.. విచిత్రమైన సంఘటనలూ ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పలు ఘటనలు జనాల్ని ఆకర్షించాయి. కుంభమేళా ముగింపు వేళ.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందా.
పూసలమ్ముకునే మోనాలిసా.. రాత్రికి రాత్రే స్టార్
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మూసలమ్ముకునే మోనాలిసా భోస్లే (Monalisa Bhonsle) గురించి. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆ అమ్మాయి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది. అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమందికి ముచ్చటేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫొటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు. ఈ ఫొటోలు, వీడియోలే ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌ని చేశాయి. ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే ఆఫర్ తెచ్చిపెట్టాయి. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.
ఐఐటీ బాబా..
ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదువుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు బాబాగా అవతరించారు. ఐఐటీ బాబాగా (IIT Baba) పిలుస్తున్నారు. ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈ ఐఐటీ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. ఐఐటీ బాబా అభయ్ సింగ్‌ది హర్యానా రాష్ట్రం. శాస్త్ర, సాంకేతిక జీవితాన్ని వదిలేసి ఆయన.. ఆధ్మాత్మిక లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన్ను ఇంజినీర్ బాబా అని కూడా పిలుస్తారు. ఐఐటీ బాబా జీవిత జర్నీ ఓ విశేషమైంది. ఫోటోగ్రాఫీ, ఆర్ట్స్ పట్ల ఫోకస్ పెట్టడానికి ముందు బాంబేలో నాలుగేళ్ల పాటు ఉన్నాడు ఆ బాబా. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ జాబ్ కూడా సంపాదించాడు. కార్పొరేట్ కంపెనీలో కొన్నేళ్లు పనిచేశాడు. ఆ జాబ్‌ను తొందరగా వదిలేశాడు. శివుడిని ఆరాధించే ఐఐటీ బాబా.. ఇప్పుడు ఆధ్యాత్మికతను ఎంజాయ్ చేస్తున్నాడు. అభయ్ సింగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 29 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. మెడిటేషన్, యోగా, ప్రాచీన సూత్రాలు, ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటాడు. మహాకుంభ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, మనస్సుకు శాంతిని ఇచ్చిందన్నాడు.
మహమండలేశ్వర్‌గా మమతా కులకర్ణి..
1990ల నాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి.. 2003 తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు భారత్‌కు వచ్చిన ఆమె మహాకుంభమేళా సందర్భంగా కిన్నెర అఖాడాలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన పేరును ‘మాయీ మమతానంద్ గిరి’గా మార్చుకున్నారు. మహమండలేశ్వర్‌గా నియామకం కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె అకాడా నుంచి బహిష్కరణకు గురయ్యారు. మహామండలేశ్వర్‌గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. పలువురు మతపెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖాడాలు వెల్లడించారు.
డిజిటల్ స్నానం
భక్తుల రద్దీ, దూర ప్రయాణం చేయలేని వారికోసం ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందినదీపక్ గోయల్ ‘డిజిటల్ స్నాన్’ (Digital Snan) సర్వీస్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో వర్చువల్‌గా పుణ్యస్నానం చేయొచ్చు. ఇందు కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపాల్సి ఉంటుంది. ఈ వర్చువల్ స్నానానికి అతడు రూ.1,100గా ధర నిర్ణయించాడు.
భర్తకు వీడియోకాల్ చేసి.. ఫోన్‌ను గంగలో ముంచి
తన భర్త కుంభమేళాకు రాలేకపోవడంతో ఒంటరిగా వచ్చిన ఓ మహిళ.. భర్తకు డిజిటల్ పవిత్ర స్నానం చేయించింది. త్రివేణీ సంగమంలో ఘాట్ వద్ద ఆమె తన భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడింది. మాట్లాడుతూనే ఫోన్‌ను నదీజలాల్లో ముంచి తీసింది. ఆమె వింత ఆలోచనకు కుంభమేళాకు వచ్చిన జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కండల బాబా.. ఫిదా అవుతున్న జనం
మహాకుంభ్‌కు అనేక ప్రాంతాల నుంచి రకరకాల సాధువులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ విదేశీ సాధువు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అనే సాధువు అందర్నీ తన లుక్స్‌తో స్టన్ చేశారు. మస్క్యూలార్ బాబా.. కండల బాబా(Muscular Baba)గా ఆయన్ను అందరూ పిలుస్తున్నారు. ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ బాబా.. కాషాయం దుస్తుల్లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు. మెడలో, చేయిల చుట్టూ రుద్రాక్షలు చుట్టి.. గంభీరమైన లుక్ ఇస్తున్నాడు. ఆధునిక యుగానికి చెందిన పరుశరాముడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇవే కాకుండా.. ఈ 45 రోజులపాటు ఏదో ఒకట ఘటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎన్నో వింతలతోపాటు పలు విషాదాలను కూడా ఈ కుంభమేళా మిగిల్చింది. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అంతేకాదు.. రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట, ట్రాఫిక్ జామ్‌లు.. ఇలా ఎన్నో ఘటనలకు కుంభమేళా సందర్భంగా వార్తల్లో నిలిచాయి.
Also Read..
Maha Kumbh | యాత్రికులతో కిటకిటలాడుతున్న ప్రయాగ్‌రాజ్.. 65 కోట్ల మంది పుణ్యస్నానాలు
Naga Sadhus: కాశీలో నాగసాధువుల ఊరేగింపు.. డ్రోన్ వీడియోలు
Mahua Maji | కుంభమేళా నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. ఎంపీకి గాయాలు