భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలపై లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. 17 రోజుల్లో ఏడు అత్యాచారాలు జరిగాయి. (7 Rapes In 17 Days) తాజాగా మేకలు మేపుతున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. జూలై 1న బర్గఢ్ జిల్లా బైరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళ, భలుమారా అడవి ప్రాంతంలో మేకలు మేపుతున్నది. ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులైన భజమాన్ భోయ్, సునంద పిహూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బీజేపీ పాలిత ఒడిశాలో 17 రోజుల్లో ఏడు అత్యాచారాలు జరుగడం ఆందోళన రేపుతున్నది. జూన్ 28న గంజాం జిల్లాలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై దూరపు బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో 22 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న అదే జిల్లాలో 17 ఏళ్ల బాలికపై క్లినిక్ యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరో కేసులో మయూర్భంజ్ జిల్లాలో ఆలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. జూన్ 19న అదే జిల్లాలో 31 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
జూన్ 18న కియోంఝర్ జిల్లాలో ఇంటి సమీపంలోని వరి పొలంలో 17 ఏళ్ల బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జూన్ 15న గోపాల్పూర్ సముద్ర తీరంలో కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:
Woman Teacher Rapes Student | విద్యార్థిని ట్రాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన లేడీ టీచర్
Watch: జలపాతంపైన నీటిలో జారిపడిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే?