Assam Floods | అస్సాంలో వరద (Assam Floods) బీభత్సం కొనసాగుతోంది. ఈ వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహించాయి. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రధాన నదులు, వాటి ఉపనదుల్లో నీటి మట్టం తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17.70 లక్షల మంది వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. వరదల కారణంగా నిన్న ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (Assam State Disaster Management Authority) ప్రకారం.. మంగళవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాచర్‌లో ఇద్దరు మరణించగా.. ధుబ్రి, ధేమాజీ, సౌత్ సల్మారా, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండ చరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 92కు పెరిగింది. అందులో ఒక్క వరదల కారణంగానే 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
వరదలకు 17.70 లక్షల మంది ప్రభావితం..
వరదల కారణంగా శుక్రవారం నాటికి 27 జిల్లాల్లో 18.80 లక్షల మంది ప్రభావితం కాగా.. మంగళవారం నాటికి ఆ సంఖ్య 17.70 లక్షలకు తగ్గింది. 38,870.3 హెక్టార్ల సాగు భూములు ముంపునకు గురయ్యాయి. 3,54,045 జనాభా కలిగిన ధుబ్రి జిల్లా ఈ వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది. ఆ తర్వాత కాచర్ (1,81,545 మంది జనాభా), శివసాగర్ (1,36,547), బార్పేట (1,16,074), గోలాఘాట్ (1,09,475) వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,021 మంది బాధితులు 507 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. సుమారు 1,04,665 మందికి అధికారులు సహాయక సామగ్రిని అందించారు.
కజిరంగా పార్క్‌లో 159 వన్యప్రాణులు మృత్యువాత
ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)ను ఇటీవలే కాలంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు ముంచెత్తాయి. దీంతో మొత్తం 159 వన్యప్రాణులు మరణించాయి. 20 జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. సుమారు 133 జంతువులను అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వదరలకు రాష్ట్రంలో 13,66,829 జంతువులు ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 94 రోడ్లు పూర్తిగా దెబ్బతినగా.. మూడు వంతెనలు కొట్టుకుపోయాయి. 26 ఇళ్లు, ఆరు కట్టలు కూడా దెబ్బతిన్నాయి. ఇక నిమతిఘాట్, తేజ్‌పూర్, గౌహతి, ధుబ్రి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది.
Also Read..
Earthquake | మహారాష్ట్రను వణికించిన స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
Kedarnath MLA | కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి
Bypolls | 7 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఉప ఎన్నికల పోలింగ్