పట్నా, అక్టోబర్ 8: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల తాకిడితో బీహార్ రోహ్టాస్ జిల్లాలో భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది. ఇక్కడి జాతీయ రహదారి(నం.19)పై రోహ్టాస్ నుంచి ఔరంగాబాద్ వరకు 65 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేవలం 5 కిలోమీటర్ల దూరానికి 24 గంటల సమయం పడుతున్నది. అంబులెన్స్‌కు దారి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ట్రక్ డ్రైవర్లు, టూరిస్టులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
గత నాలుగు రోజులుగా వాహనాలు రోడ్లపై నిలిచిపోయినా.. అధికార యంత్రాంగం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇక్కడ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని చేపట్టడంతో, ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేసిన సర్వీస్ రోడ్లు, ఇతర మార్గాలు వరద నీటిలో మునిగిపోయాయి.