Himachal Pradesh | హిల్స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను భారీ వర్షాలు (Heavy Rains) అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.
పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జులై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జులై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఏకాంత ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Also Read..
Air India | పరిహారం కోసం ఆర్థిక వివరాలు అడుగుతోందంటూ ఆరోపణలు.. ఖండించిన ఎయిర్ ఇండియా
Lalit Modi: పార్టీలో పాట పాడి.. ఎంజాయ్ చేసిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా.. వీడియో