ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. భారత్‌లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాలరేటు ఎక్కువవుతున్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని శరీరంలో వచ్చే ఆరు మార్పులతో నెల ముందుగానే పసిగట్టవచ్చని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజాగా వెల్లడించింది. ఆ సంకేతాలను అర్థంచేసుకుని మసలుకుంటే ప్రమాదాన్ని ముందుగానే నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
Heart Attack | (స్పెషల్ టాస్క్ బ్యూరో) : ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం గుండెజబ్బులు తీవ్రమయ్యాయి. యువకులు, చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు నిత్యం చూస్తున్నాం. దేశంలో ఏటా 30 వేల మంది గుండెపోటుకు బలవుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గుండెపోటును ముందస్తుగా గుర్తించకపోవడంతోనే మరణాలరేటు ఎక్కువవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని శరీరంలో వచ్చే ఆరు మార్పులతో నెల ముందుగానే పసిగట్టవచ్చని
‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజాగా వెల్లడించింది.

ఛాతీ మధ్యలో ఒత్తిడి
ఉన్నట్టుండి ఛాతీ మధ్యభాగంపై ఒత్తిడి పెరుగుతుంది. అది క్రమంగా భరించలేని నొప్పిగా మారుతుంది. ఇది కొద్ది నిమిషాలపాటు కొనసాగుతుంది.
తల తిరగడం
శరీరానికి అవసరమైన నీరు, ఆహారం క్రమంగా తీసుకొన్నప్పటికీ తరుచూ తల గిర్రున తిరుగడం జరుగుతుంది. గుండెకు సరఫరా అయ్యే రక్తం మోతాదు తగ్గడంతోనే ఇది జరుగుతుంది.
ఊపిరి ఆడకపోవడం
ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అదే సమయంలో ఛాతీనొప్పి కూడా రావొచ్చు.
మిగతా శరీర భాగాల్లో నొప్పి
గుండెనొప్పి వచ్చే ప్రమాదమున్నప్పుడు ఛాతీతో పాటు నడుము, భుజాలు, చేతులు, మెడ, దవడల్లో కూడా నొప్పి కలుగుతుంది.
వికారం, అజీర్ణం
కడుపులో వికారం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, తరుచూ వాంతులు కావడం, పొట్ట ఉబ్బరంగా మారడం, గుండెలో మంట వంటివి కొనసాగుతాయి.
విపరీతంగా చెమటపోయడం
వ్యాయామం చేసిన తర్వాత చెమటపోయడం సహజం. అయితే, అవేమీ చేయనప్పటికీ విపరీతంగా చెమట పోయడం, శరీరం చల్లబడటం జరుగుతుంది. గుండెపోటు వచ్చే సూచన ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి నాడీవ్యవస్థ యాక్టివ్‌గా పనిచేయడంతోనే విపరీతంగా చెమట వస్తుందని వైద్యులు చెప్తున్నారు.

గుండెపోటు వచ్చే ముప్పును ఇంట్లోనే ఉంటూ సులభంగా కనిపెట్టే టెస్టును స్వీడిష్ పరిశోధకులు ఇటీవల అభివృద్ధి చేశారు. ప్రత్యేక అల్గారిథమ్‌తో పనిచేసే ఈ టెస్ట్‌లో భాగంగా పరిశోధకులు 14 సులభమైన ప్రశ్నలను సిద్ధం చేశారు. వ్యక్తి వయసు, లింగం, బరువు, నడుము చుట్టుకొలత, ధూమపానం అలవాటు, రక్తపోటు, రక్తంలో కొవ్వుల స్థాయి, మధుమేహం, గతంలో కుటుంబసభ్యులకు గుండెజబ్బులు ఉన్నాయా? లేదా? వంటి ప్రశ్నలతో ఈ టెస్ట్ ఉంటుంది. దీని ఫలితాలు 65 శాతం కచ్చితమైనవని పరిశోధకులు పేర్కొన్నారు.