మేదినినగర్: జార్ఖండ్‌లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్‌గంజ్‌లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో వ్యానులోని ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జార్ఖండ్‌లోని పంకీ గ్రామానికి చెందిన కూలీలు బీహార్‌లోని సిహుడికి పొలం పనులకు వ్యాన్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో హరిహర్‌గంజ్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మరో 18 మంది గాయపడ్డారని, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.