కోల్కతా: ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) రెండో దశ తర్వాత పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల మంది పేర్లను తొలగించి ముసాయిదా జాబితాను మంగళవారం ప్రచురించారు. ఇందులో 24.16 లక్షల మంది ఓటర్లు మృతి చెందారని గుర్తించి వారి పేర్లను తొలగించారు. మరో 19.88 లక్షల మంది శాశ్వతంగా నివాసం మార్చుకోవడం లేదా వలస వెళ్లడంతో వారి పేర్లనూ తొలగించారు.
12.20 లక్షల మంది అదృశ్యం అయినట్లు పేర్కొన్నారు. 1.38 లక్షల మందిని తప్పుడు, డూప్లికేట్ లేదా బోగస్ ఓటర్లుగా భావించి వారి పేర్లను తొలగించారు. మరో 57 వేల మంది ఓటర్ల పేర్లను ఇతర కారణాల వల్ల తొలగించారు. అయితే వీరెవరైనా మళ్లీ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు కోసం ఫామ్ 6ను, అందుకు మద్దతు తెలిపే దస్ర్తాలను ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చు.