Chhattisgarh | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత (anti-Naxal operation) కొనసాగుతున్నది. బీజాపుర్ (Bijapur) అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Naxals) నక్కిఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కూంబింగ్ చేపడుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో (Karregutta hills) పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అడవిలో దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో వెయ్యి మంది మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారం ఉంది. వీరిలో హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాలను పూర్తిగా చుట్టుముట్టి, డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 250 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను వేలాదిమంది బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టుల కదలికల ప్రచారం, పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులతో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు రాత్రి, పగలు తేడా లేకుండా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ భారీ ఆపరేషన్‌తో భీమవరం పాడు, పూజారి కాంకేర్, పామేడు, ఊసూరు వంటి సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తుపాకీ శబ్దాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఆపరేషన్ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్యమ మరింత పెరిగే అవకాశం ఉన్నది.
వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సల్స్‌ను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారని తెలిపారు. నక్సల్స్‌ను రూపుమాపడంలో.. సీఆర్పీఎఫ్ వెన్నుముకగా నిలిచినట్లు ఆయన చెప్పారు. గత వారం అమిత్ షా చేసిన ఈ ప్రకటనతో ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ముమ్మరమైంది.
Also Read..
Pahalgam Attack | ఉగ్రదాడి కారణంగా పాక్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు.. ఇంతకీ ఏంటా ఒప్పందం..?
Pahalgam Tourism | సంక్షోభంలో పహల్గాం పర్యాటకం.. జీవనాధారం కోల్పోయిన స్థానికులు
Encounter | బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి