Pahalgam : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో రెండు రోజుల క్రితం జరిగిన ఉగ్రవాదుల దాడి అక్కడి పర్యాటక పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా బతుకుతున్న స్థానికులు తమ జీనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పర్యాటకులు రాక చిరు వ్యాపారులు, ఉపాధి లేక దుకాణాలు, హోటళ్లలో పనిచేసే చిరుద్యోగులు తాము బతికేదెలా అని ఆందోళన చెందుతున్నారు.
పహల్గాంలో పర్యాటక పరిశ్రమే స్థానికులకు బతుకుదెరువు. అక్కడి స్థానికుల్లో వివిధ దుకాణాల ద్వారా పర్యాటకులకు అవసరమైన వస్తువులను విక్రయిస్తూ కొందరు, హోటల్లు, రెస్టారెంట్ల ద్వారా పర్యాటకులకు భోజనం, బస సౌకర్యాలు కల్పిస్తూ మరి కొందరు జీవిస్తున్నారు. వారి దగ్గర వివిధ పనులు చేస్తూ పలువురు కూలీలు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
ఉగ్రవాదుల దాడితో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. పర్యాటకులంతా పహల్గాం నుంచి తిరిగి వెళ్లిపోయారు. పలువురు స్థానికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. దాంతో అక్కడి దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. దాంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము బతికేదెలా అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితి తమకు గతంలో ఎన్నడూ ఎదురుకాలేదని అవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాగా, గత మంగళవారం మధ్యాహ్నం ఐదుగురు ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా నరమేధం సృష్టించారు. విహారయాత్రకు వచ్చిన మహిళలు, పిల్లలను విడిచిపెట్టి పురుషులను కాల్చిచంపారు. అనంతరం తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.