Medical Negligence | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి (Medical Negligence) ఏడాది చిన్నారి బలయ్యాడు. డీహైడ్రేషన్ (dehydration)కు గురైన ఓ చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయాడు. వైద్యం కోసం చిన్నారి తల్లి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 180 కిలోమీటర్ల పరిధిలోని ఐదు ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి స్పందించారు. ఈ మేరకు దర్యాప్తునకు ఆదేశించారు.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషీ ఏడాది కుమారుడు శివాంష్ జోషీ (Shivansh Joshi) జులై 10న విపరీతంగా వాంతులు చేసుకోవడంతో తల్లిపాలు ఇవ్వడానికి సాధ్యం కాలేదు. దీంతో చిన్నారి డీహైడ్రేషన్‌కు గురయ్యాడు. ఆ సమయంలో దినేష్ డ్యూటీ నిమిత్తం జమ్ము కశ్మీర్లో ఉన్నారు. చేసేదేమీ లేక తల్లి చిన్నారిని తొలుత చమోలిలోని గ్వాల్డామ్లో గల పీహెచ్‌సీకి తీసుకెళ్లింది. అయితే, అక్కడ పిల్లల వైద్యుడు లేకపోవడంతో చిన్నారిని 22 కిలోమీట్ల దూరంలో ఉన్న బాగేశ్వర్‌లోని బైజ్నాథ్లోగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు.
వైద్యుల సూచన మేరకు కమ్మూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే, అక్కడ అత్యవసర వార్డులో డ్యూటీలో ఉన్న వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డాక్టర్ మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నాడని బాధిత కుటుంబం ఆరోపించింది. డాక్టర్ గానీ ఇతర సిబ్బంది గానీ మర్యాదగా మాట్లాడలేదని తెలిపింది. వైద్యులు చూడకపోగా అల్మోరాకు రిఫర్ చేశారని వాపోయారు. తీరా అక్కడికి వెళ్లాక బిడ్డ మెదడులో రక్త ప్రవాహ అవరోధంతో బాధపడుతున్నాడని పిల్లల వైద్యుడు తెలిపినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఐసీయూ యూనిట్ లేకపోవడంతో చిన్నారిని వెంటనే ఉన్నత కేంద్రానికి తీసువెళ్లాలని వైద్యుడు సూచించినట్లు చెప్పారు.
‘రాత్రి 7 గంటలకు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే స్పందించలేదు. జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫోన్‌చేసి సాయం కోరిన తర్వాత అత్యవసర సేవా వాహనం రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చింది. చివరికి రాత్రి 9:30 గంటలకు నాలుగో ఆస్పత్రి అయిన అల్మోరా మెడికల్ కాజేజీకి తీసుకెళ్లాం. అక్కడ బాబుకు చికిత్స అందించారు. కానీ మళ్లీ నైనిటాల్‌లోని హల్ద్వానీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. జులై 12న హల్ద్వానీలో వైద్యులు బాబుని వెంటిలేటర్‌పై ఉంచారు. నాలుగు రోజుల తర్వాత జులై 16న నా కొడుకు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వైద్యుల నిర్లక్ష్యం, సరైన వైద్యసదుపాయాలు లేకపోవడంతో నాబిడ్డను కోల్పోయాను అంటూ వాపోయింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ తీవ్రంగా స్పందించారు. దురదృష్ట ఘటనగా అభివర్ణిస్తూ.. విచారణకు ఆదేశించారు.
Also Read..
Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ఉన్నది వీళ్లే
Viral Video | అదుపుతప్పి స్కూటీపై నుంచి కిందపడ్డ వ్యక్తి.. దూసుకెళ్లిన కారు.. రెప్పపాటులో ఎంత ఘోరం