సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 ( నమస్తే తెలంగాణ ) : ఇకపై వాహనానికి సబంధించి ఫిట్నెస్, బీమా పునరుద్ధరణలో పీయూసీ(పొల్యూషన్ అండర్ కంట్రోల్ ) సర్టిఫికెట్ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు పీయూసీ కేంద్రాల్లో వాహనాలకు మానవ ప్రమేయంతో ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ విధానంతో అవకతవకలు జరుగుతున్నాయని భావించిన ఆర్టీఏ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో డేటాబేస్ రూపొందించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకు మాత్రమే పీయూసీ జారీ అయ్యేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పర్యవేక్షించనున్నారు.
టెస్టింగ్ ప్రోబ్‌ను వాహనం యొక్క సైలెన్సర్‌లో ప్లగ్ చేసిన తర్వాత ఉద్గార రీడింగ్‌లు సంగ్రహించబడతాయి. ఆటోమెటిక్‌గా పీయూసీ వివరాలు రికార్డ్ అవుతాయి. ఈ విధానం ఆర్టీఏ డేటాబేస్‌తో లింకప్ అయ్యి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే పీయూసీ జారీ చేస్తారు. పీయూసీ ఉంటేనే వాహన ఫిట్నెస్, బీమా పునరుద్ధరణ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వివరించారు.
వాహనాల కాలుష్యం రెట్టింపు..
వాహనాల కాలుష్యం అంతకంతకు రెట్టింపు స్థాయిలో నగరంలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే నగరంలో 20 లక్షలకు పైగా వాహనాలు కాలం చెల్లినవిగా గుర్తించారు. ఈ వాహనాలు పీయూసీ(పొల్యూషన్ అండర్ కంట్రోల్ ) సర్టిఫికెట్ లేకుండానే రోడ్లపై నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొత్త వాహనానికి ఏడాది వరకు పీయూసీ అనుమతి ఉంటుంది. అంతకు మించిన వాహనాలు ప్రతి 6 నెలలకు ఒకసారి పీయూసీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటు ంది.
అందుకోసం రాష్ట్రంలో 417 పీయూసీ కేంద్రాలు ఉన్నాయి. మొబైల్ వాహన పీయూసీ కేంద్రాలు రోడ్లపై సేవలందిస్తున్నాయి. కాలుష్యం అధిక స్థాయిలో నమోదవుతున్న దృష్ట్యా రవాణా శాఖ అధికారులు పీయూసీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ డేటాతో వాహనాల సమాచారం గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. నగరంలో పీయూసీ లేని 17 లక్షలు ద్విచక్ర వాహనాలు, 3.7లక్షలు కార్లు, ఇతర గూడ్స్, ఆటో, క్యాబ్‌లు ఉన్నాయని అధికారులు తెలిపారు. చాలా వరకు గూడ్స్ క్యారియర్లు, ఆర్టీసీ బస్సులు పొగలు చిమ్ముతున్న ఘటనలు అధికంగా ఉన్నాయి. వీటన్నింటిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు యోచిస్తున్నారు.