మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కాంగ్రెస్‌లో కుంపటి రాజేసింది. 60 మంది కార్పొరేటర్లను ఆంధ్రాకు తీసుకువెళ్లి ఆదివారం సాయంత్రం శంషాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. మేయర్, డిప్యూటీగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో సోమవారం తెల్లవారుజామున కాంగ్రెస్ నేతలకు మధ్య విభేదా లు చెలరేగాయి. వర్గాలుగా విడిపోయిన క్యాంపులోని కార్పొరేటర్లు తన్నుకునే పరిస్థితి వచ్చింది.
ఇంతలోనే ఏమైందో ఏమో కానీ శంషాబాద్ పోలీసులు సడన్‌గా ఎంట్రీ ఇచ్చారు. రిసార్ట్స్ మేయర్ పదవి ఆశిస్తున్న ప్రముఖ నేత ఆనంద్ గౌడ్ బస చేస్తున్న రూమ్‌లో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజు సమక్షంలోని ఈ సోదాలు జరగడం.. కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని, కాంగ్రెస్ నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది.
సీఎం సొంత జిల్లాలో ఎంఐఎం ఇండిపెండెంట్ల మద్దతుతో కావాల్సిన బలం, బలగం ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య పదవుల ఎంపిక చిచ్చు రాజేసింది. మేయర్ పదవి ఆశిస్తున్న ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ప్రలోభాలకు దిగుతూ అడ్డం గా దొరికిపోయాడని ఆ పార్టీ నేతలు మీడియాకు సమాచారం అందించారు. అంతేకాకుండా వీడియోలను కూడా బయటికి పంపించారు. శంషాబాద్ పోలీసులు హు టాహుటిన అక్కడికి చేరుకొని భారీగా నగదును స్వాధీనం చేసుకుని.. ఆనంద్‌గౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఈ వ్యవహారం పీసీసీ చీఫ్ మహేశకుమార్గౌడ్కు తెలియడంతో కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరువును బజారుకీడుస్తున్నారంటూ అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతను వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా.. క్యాంప్‌లో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చి దాడులకు పంపించారని ప్రచారం జరుగుతోంది. మేయర్ రేస్‌కు పోటీలో ఉన్న సొంత పార్టీ కార్పొరేటర్లను పోలీసులతో దాడులు జరిపి అరెస్టు మరో వ ర్గం దాడి చేయించడంతో పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
సీఎం సొంత జిల్లాలో కాక రేపుతున్న ఎన్నిక
పాలమూరు కార్పొరేషన్లో 60 డివిజన్లకుగానూ కాంగ్రెస్ 29 డివిజన్లు సొంతంగా గెలిచింది. నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడా కూడగట్టడంతో కాంగ్రెస్ బలం 33కు చేరింది. మరో ముగ్గురు ఎంఐఎం సభ్యుల మద్దతు తీసుకోవడంతో 36కు పెరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి కూడా ఎక్స్అఫీషియల్ సభ్యుడుగా ఓటు నమోదు చేసుకోవడంతో మొత్తం 37 మంది అయ్యారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికలు జరగక ముందు నుంచే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్‌కు మేయర్ పదవి దక్కుతుందని కాంగ్రెస్ నేతలు భావించారు.
ఎన్నికల్లో కూడా ఈ మేరకు మేయర్ పదవి ఇస్తామని చెప్పి భారీగా డబ్బులు ఖర్చు చేయించారు. పట్టణంలోని ఇతర కార్పొరేటర్లకు కూడా ఎన్నికల్లో డబ్బులు, మందు ఇప్పించినట్లు కూడా కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత సదరు ఆనంద్ కుమార్ భార్య ప్రసన్నకు మేయర్ పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది చక్రం తిప్పారు. తమ ఓటమికి కారణమయ్యాడని కొందరు.. మేయర్ పదవి ఇస్తే భవిష్యత్తులో పార్టీకి కష్టమని చెప్పి మరికొందరు.. మేయర్ పదవి తాము చెప్పినట్లు వినే వాళ్లు కావాలని ఎమ్మెల్యే సన్నిహితుడు ఒకరు పట్టుబట్టడంతో చివరి నిమిషంలో మేయర్ అభ్యర్థిత్వం ఓనమాలు తెలియని కార్పొరేటర్‌కు ఇచ్చేందుకు అంగీకరించారు.
అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఎంపికపైనే కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడ్డారు. చివరకు మూడో డివిజన్ కార్పొరేటర్ మమతకు ఇవ్వాలని నిర్ణయించడంతో అసలు కథ మొదలైంది. దీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆనంద్‌గౌడ్ తనకు మేయర్ పదవి ఇస్తానని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఏమైందో ఏమో కానీ తెల్లవారుజామున ఆయన బస చేస్తున్న రూమ్‌పై శంషాబాద్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు చేపట్టారు.
అంతటితో ఆగకుండా కార్పొరేటర్లు ఉన్న రూములు అన్ని కూడా సోదా చేశారు. దీంతో భారీగా నగదు పట్టుబడిందని సమాచారం. ఇదంతా ఆనందగౌడే కావాలని కార్పొరేటర్లు ప్రలోభ పెట్టేందుకు డబ్బులు తీసుకువచ్చి పంచుతున్నాడని మరో వర్గం ఆరోపించింది. ఈ వ్యవహారం పోలీసులు మీడియా వరకు వెళ్లడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జోక్యం చేసుకొని పరిస్థితి వచ్చింది. చివరకు కార్పొరేటర్ భర్తను రిసార్ట్స్‌లోని రూంలోనే అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్టు చేయించారు. కార్పొరేటర్లను తీసుకొని అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. హైడ్రామా మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా కొనసాగింది.
కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి
మహబూబ్‌నగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఊహించని విధంగా కట్టబెట్టడంతో ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి రేగింది. ఎన్నికల ముందు ఒకలాగా.. ఎన్నికలయ్యాక మరోలాగా.. వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కంగుతిన్నారు. వాస్తవంగా డిప్యూటీ మేయర్ పదవి సుమారు 16 కార్పొరేట్ స్థానాలు గెలిచిన మైనారిటీలకు ఇస్తారని ఊహించారు. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కొడుకు ఉమర్ కొత్వాల్‌కు డిప్యూటీ మేయర్ దక్కుతుందని లీకులు వచ్చాయి.
అదే రకంగా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి భార్యకు కూడా మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని ఫీల్డ్ కవర్లో పేర్లు ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. మరోవైపు మీడియా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బెనహర్ కూతురికి కూడా డిప్యూటీ మేయర్ ఖాయమని అంతా భావించారు. చివరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చక్రం తిప్పడంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి మేయర్, డిప్యూటీ మేయర్లను దగ్గరుండి ఎంపిక చేయించి బయటికి తీసుకొచ్చారు. దీంతో సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.