BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ 9 ఏండ్లు గడిచినా ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏండ్ల లోపు యువకుల్లో 42 శాతానికి పైగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు అధికంగా ఉన్నారు. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయ్మెంట్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా వర్కింగ్ సర్వే-2023’ నివేదిక ప్రకారం 25 ఏండ్ల లోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. మాధ్యమిక విద్యను పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారి సంఖ్య 21.4 శాతంగా ఉన్నది. డిగ్రీ చేసిన యువకులు తగిన ఉద్యోగం లభించకపోవడంతోపాటు, తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడటం లేదని, దీంతో నిరుద్యోగ రేటు పెరిగిందని నివేదిక పేర్కొంది.
ఓవైపు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేక నిరుద్యోగిత రేటు పెరుగుతున్నదని ఇటీవలి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సర్వే పేర్కొన్నది. గ్రామీణ భారతంలో నిరుద్యోగిత రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పట్టణాల్లో 8 నుంచి 10 శాతం ఉంది. దీర్ఘకాలంగా అంటే 41 నెలలుగా నిరుద్యోగిత రేటులో ఎలాంటి తగ్గుదల లేదని గత ఫిబ్రవరిలో విడుదలైన రిపోర్టు పేర్కొన్నది. కార్మిక భాగస్వామ్యం కూడా 42.9 నుంచి 39.8 శాతానికి పడిపోవడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరగటం లేదని నివేదించింది.
దేశంలో నిరుద్యోగం ఏటికేటికి పెరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023-24 బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం 33 శాతం నిధులు కోత పెట్టింది. అదేవిధంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడంపై శ్రద్ధ చూపకపోవడం, జాతీయ జీవనోపాధి మిషన్, గ్రామీణ గృహ నిర్మాణ పథకం, తదితర సంక్షేమ రంగాలకు కూడా కేంద్రం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంతో ఆ ప్రభావం ఉపాధి కల్పనపై తీవ్రంగా పడింది. దీనికి తోడు గోరుచుట్టుపై రోకటి పోటన్నట్లు జీఎస్టీ అమలు, నోట్ల రద్దు, కొవిడ్ సంక్షోభం తదితర కారణాలతో ఆర్థిక కార్యకలాపాల వేగం మందగించింది.
కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాల్లో కూడా కోత పెడుతుండటంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దేశంలోని మొత్తం 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగులు ఉండగా, 2022లో ఈ సంఖ్య 14.6 లక్షలకు తగ్గింది. ఒక్క బీఎస్ఎన్ఎల్లోనే గత 9 ఏండ్లలో లక్షా 81వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. మరోవైపు నష్టాల పేరిట పీఎస్యూల్లో శాశ్వత ఉద్యోగులను తగ్గిస్తూ రోజువారీ కార్మికులను, కాంట్రాక్టు ఉద్యోగులను పెంచుతుండటంతో ఆయా సంస్థల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2013లో మొత్తం పీఎస్యూల్లో 40 వేల మంది దినసరి కార్మికులుంటే.. ప్రస్తుతం లక్ష మంది ఉన్నారు. 2013లో అలాగే 2.9 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులుంటే నేడు 5.2 లక్షల మంది ఉన్నారు.