కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 20: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ చీఫ్ హిడ్మా దంపతుల అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం నిర్వహించారు. ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ నెల 18న జరిగిన ఎన్కౌంటర్లో వారు మృతిచెందిన విషయం విదితమే. వీరితోపాటు మరో నలుగురు కూడా మృతిచెందారు. వీరి మృతదేహాలకు ఏపీలో గురువారం పోస్టుమార్టం పూర్తయ్యింది. తన వయసు సహకరించడం లేదని హిడ్మా తల్లి మడావి పొజ్జె చేసిన అభ్యర్థన మేరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆంధ్రా ప్రభుత్వ సహకారంతో మృతదేహాలను స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి తరలించారు. ఊరి పొలిమేర నుంచే 300 మంది గ్రామస్థులు హిడ్మా దంపతుల మృతదేహాలను స్వగృహానికి తరలించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అంతిమయాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తమ వద్ద లేరని ఏపీ పోలీసులు హైకోర్టుకు వెల్లడించారు. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను కోర్టులో హాజరుపర్చేలా ఉన్నతాధికారులను ఆదేశించాలంటూ దాఖలైన హెబియస్‌కార్పస్ పిటిషన్‌పై గురువారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.