జమ్ము : నిర్వాసిత కశ్మీరీ పండిట్లకు స్వతంత్ర ప్రాంతం (సెపరేట్ హోమ్‌ల్యాండ్) ఇవ్వాలని యూత్ ఫర్ పనున్ కశ్మీర్ (వై4పీకే) డిమాండ్ చేసింది. వై4పీకే అపెక్స్ కమిటీ చైర్మన్ రాహుల్ కౌల్ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, ఉగ్రవాదం వల్ల కశ్మీరు లోయ నుంచి తాము సామూహికంగా వలసపోయి 35 ఏళ్లు గడిచిందన్నారు. నిర్వాసిత కశ్మీరీలకు ప్రత్యేక స్వతంత్ర ప్రాంతం డిమాండ్ సాధన కోసం వచ్చే జనవరి 16 నుంచి మహా అభియాన్ ఆహ్వాన్ 2026ను నిర్వహిస్తామని తెలిపారు. ఇది అత్యంత నిర్ణయాత్మక ప్రజా సమీకరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జమ్ములోని నిర్వాసిత కశ్మీరీ పండిట్ల వలసదారుల శిబిరం జాగ్టి నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు.
ఇది నరమేధానికి గురైన, సడలని స్ఫూర్తి గల ప్రజల రాజీలేని పోరాటమని తెలిపారు. భారత ప్రభుత్వం నిర్వాసిత పౌరులతో శ్రద్ధగా, అత్యవసరంగా మాట్లాడాలని, రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పనున్ కశ్మీర్ ఉద్యమానికి రాజకీయ, మౌలిక సైద్ధాంతిక మార్గసూచి అయిన 1991నాటి మార్గదర్శన్ తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహా అభియాన్ ఆహ్వాన్ 2026 కేవలం నామమాత్రపు కార్యక్రమం కాదని, ఇది ప్రజల పిలుపు అని వై4పీకే నేతలు చెప్పారు. కశ్మీరీ హిందువులకు తక్షణమే తమ స్వస్థలంలో పునరావాసం కల్పించకపోతే, ఈ ఉద్యమం మరో రూపం తీసుకుంటుందని హెచ్చరించారు. ఇది 35 ఏళ్ల నుంచి గుండెల్లో అగ్ని జ్వాలలు రగులుతున్న ప్రజలు సంఘటితంగా చేస్తున్న ఉద్యమమని తెలిపారు.